ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 3 నవంబరు 2020 (08:05 IST)

రాజధాని ప్రాంతం నుంచే ప్రజా తీర్పు కోరుదాం: జనసేన

రాజధాని మార్పునకు అనుకూలంగా, వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న రెండు వర్గాల తరఫున బాపట్ల, గుంటూరు పార్లమెంటు సభ్యులు తమ పదవులకు రాజీనామా చేసి ఈ ప్రాంతం నుంచే ప్రజా తీర్పు కోరాలని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు.

రాజధాని అంశం మీద ఎంపిలు రాజీనామా చేస్తే కేంద్రంలో కూడా కదలిక వస్తుందన్నారు. ఇటీవల ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసిన రాజధాని రైతులను పరామర్శించేందుకు పార్టీ అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్, సెంట్రల్ ఆంధ్రా సంయుక్త కమిటీ సభ్యులు గాదె వెంకటేశ్వరరావు, పాకనాటి రమాదేవిలతో కలసి గుంటూరు జిల్లా జైలు వద్దకు వెళ్లారు.

పోలీసులు జనసేన నాయకులను అడ్డుకోగా, అక్కడి నుంచి కృష్ణాయపాలెం, మందడం, అనంతవరం, రాయపూడి, వెలగపూడి, తుళ్లూరు తదితర గ్రామాల్లో రాజధాని రైతుల నిరసన శిబిరాలను సందర్శించి వారికి సంఘీభావం తెలిపారు.

ఛలో గుంటూరు సందర్భంగా జరిగిన లాఠీఛార్జ్‌లో గాయపడిన మహిళలను, అరెస్టు అయిన రైతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ...  "మూడు రాజధానులకు మద్దతు ఇస్తున్న బాపట్ల ఎంపి నందిగం సురేష్, వ్యతిరేకిస్తున్న గుంటూరు ఎంపి గల్లా జయదేవ్ ఇద్దరు రాజీనామా చేసి రాజధాని ప్రాంతం నుంచే ప్రజా తీర్పు కోరాలి.

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అమరావతి ప్రాంతానికి వ్యతిరేకంగా రైతులను ఇబ్బందిపెట్టే ధోరణిలో వ్యవహరిస్తోంది. బయటి నుంచి వచ్చిన వ్యక్తుల్ని వదిలేసి రాజధాని రైతులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడం దుర్మార్గమైన చర్య. రైతులు రాష్ట్ర ప్రభుత్వానికి భూములు ఇచ్చారుగానీ, ఓ కులానికో, మతానికో ఇవ్వలేదు.

గుంటూరు జైలు వద్ద పోలీసులు అడ్డుకోవడం సరైన పద్దతి కాదు. ములాఖత్ కుదరదు అన్న విషయాన్ని సూపరిండెంట్ గారు చెప్పాలి. రోడ్డు మీదే పోలీసులు అడ్డుకోవడం ఏంటి? ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. రాబోయే రోజుల్లో రాజధాని ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం" అన్నారు. 
 
రాజధాని ఓ కులానిది కాదని ప్రభుత్వమే రుజువు చేసింది...
పోతిన వెంకట మహేష్ మాట్లాడుతూ "రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు బేడీలు వేయడాన్ని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే భూములు ఇచ్చిన రైతులకు కులం అంటగడుతోంది, ఎస్సీ, బీసీ వర్గాలకు చెందిన రైతులను అరెస్టు చేయడం ద్వారా రాజధాని ఉద్యమం ఒక కులానికి చెందినది కాదని తేలిపోయింది.

ఈ ప్రాంతంలో అన్ని కులాలు ఉన్నాయన్న విషయాన్ని ప్రభుత్వమే రుజువు చేసింది. భూములు ఇచ్చిన రైతులకు బేడీలు వేయడం అంటే రాష్ట్ర అభివృద్దికి సంకెళ్లు వేయడమే. రాజధాని నిర్మాణం పూర్తి చేసి ఉంటే రాష్ట్రం అభివృద్ధి వైపు అడుగులు వేసేది. అప్పుల ఆంధ్రప్రదేశ్‌గా ఉండేది కాదు.

రాజధాని మార్చాలన్న జగన్ రెడ్డి అనాలోచిత నిర్ణయమే రాష్ట్రం అప్పుల ఆంధ్రప్రదేశ్‌గా మిగిలిపోవడానికి కారణం. రైతులు 300 రోజులకు పైగా తమ హక్కుల కోసం ఉద్యమం చేస్తే.. పోలీసులు వారిపై కేసులు పెట్టే విషయంలో పోటీ పడుతున్నారు. ఇప్పటి వరకు సుమారు 4 వేల మంది రైతులపై కేసులు పెట్టారు. ఇది దుర్మార్గమైన చర్య.

దళితుల రక్షణ కోసం ఏర్పాటు చేసిన చట్టాలను అదే దళితులపై ప్రయోగిస్తుంటే దళిత ఐ.కా.స.లు ఎందుకు స్పందించడం లేదు. కులాల మధ్య చిచ్చుపెడుతూ.. పైకి మాత్రం కులోన్మాదం అంటూ ముఖ్యమంత్రి మాటలు చెబుతున్నారు" అని అన్నారు.

రాజధాని పర్యటనలో భాగంగా పాలకుల మనసు మారాలని కోరుతూ అనంతవరంలో కొండ మీద వెంకటేశ్వరస్వామి ఆలయంలో శ్రినివాస్ యాదవ్ పొంగలి సమర్పించారు.