మంగళవారం, 31 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 28 ఏప్రియల్ 2024 (16:46 IST)

సత్యసాయి జిల్లా వైకాపాలో లుకలుకలు - పార్టీ సంయుక్త ప్రధాన కార్యదర్శి రాజీనామా!!

ysrcp flag
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైకాపాకు మరో షాక్ తగిలింది. శ్రీ సత్యసాయి జిల్లా వైకాపాలో లుకలుకలు వెలుగుచూశాయి. పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డికి మరోమారు టిక్కెట్ ఇవ్వడాన్ని నిరసిస్తూ పార్టీ సంయుక్త కార్యదర్శి విజయభాస్కర్ రెడ్డి రాజీనామా చేశారు. పార్టీ సభ్యత్వానికి సైతం ఆయన రాజీనామా చేశారు. అలాగే, మరికొందరు కూడా రాజీనామాలు చేశారు. ఈ సందర్భంగా విజయభాస్కర్ రెడ్డి పుట్టిపర్తి వైకాపా ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డిపై ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. శ్రీధర్ రెడ్డికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని విమర్శించారు. పుట్టపర్తి అభివృద్ధికి కట్టుబడి ఉండే పార్టీకే ఓటు వేయాలని ఆయన పిలుపునిచ్చారు. 
 
లోచర్ల విజయభాస్కర్ రెడ్డి గతంలో కూడా ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డికి వ్యతిరేకంగా తన అసంతృప్తి గళాన్ని వినిపించిన విషయం తెల్సిందే. శ్రీధర్ రెడ్డికి మరోమారు టిక్కెట్ ఇస్తే ఏమాత్రం పని చేయబోమని, సహకరించబోమని తెలిపారు. ఎమ్మెల్యే ప్రవర్తన మూలంగా నాయకులు పార్టీకి దూరమవుతున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో పుట్టపర్తి టిక్కెట్‌ను వైకాపా నాయకత్వం మరోమారు శ్రీధర్ రెడ్డికే ఇవ్వడంతో అసంతృప్తి జ్వాలలు భగ్గుమన్నాయి. ఈ క్రమంలోనే లోచర్ల విజయభాస్కర్ రెడ్డి పార్టీని వీడినట్టు అర్థమవుతుంది.