గోమాంసం వినయోగమే లక్ష్యంగా కాంగ్రెస్ : సీఎం యోగి ఆదిత్యనాథ్
లోక్‌సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. దీనిపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అదికారంలోకి వస్తే గోమాంసం వినియోగాన్ని అనుమతించడమే లక్ష్యంగా పెట్టుకుందని ఆయన ఆరోపించారు.
విపక్షాల ఇండియా కూటమి గోమాంసాన్ని ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. ఆవును పవిత్రంగా భావిస్తున్న దేశంలోని హిందూ సమాజం గోమాంస వినియోగానికి పూర్తిగా దూరం జరిగిందని యోగి అన్నారు. ఈ విషయంలో ముస్లింలకు మినహాయింపులు ఇవ్వాలనే కాంగ్రెస్ ప్రయత్నం అందరికీ ఆమోదయోగ్యం కాదని విమర్శించారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం యోగి ఆదిత్యనాథ్ మీడియాతో మాట్లాడారు. అంతకుముందు శుక్రవారం నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో కూడా గోమాంసం వినియోగంపై ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ మైనారిటీలకు గొడ్డు మాంసం తినే హక్కును కల్పించాలని కోరుకుంటోందని అన్నారు.
జంతు వధకు సంబంధించి ఉత్తరప్రదేశ్లో ఇప్పటికే కఠినమైన చట్టాలు ఉన్నాయని, 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష, రూ.5 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉందని ఆయన ప్రస్తావించారు. కాగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 2020లో గోవధను నిషేధిస్తూ ఆర్డినెన్స్‌ను రూపొందించింది. అనంతరం దానిని చట్టంగా మార్చిన విషయం తెలిసిందే.