1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : మంగళవారం, 3 మార్చి 2015 (16:02 IST)

బీజేపీది పచ్చిమోసం... ఏరు దాటాక తెప్ప తగలేయడమే : జేపీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై భారతీయ జనతా పార్టీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనుసరిస్తున్న వైఖరిపై పచ్చి మోసం, దగా అని లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్ మండిపడ్డారు. ప్రత్యేక హోదా తెలుగు ప్రజల హక్కు అని పునరుద్ఘాటించారు. అయితే, బీజేపీ వ్యవహారశైలి చూస్తుంటే ఏరు దాటాక తెప్ప తగలేసినట్టుగా ఉందని ధ్వజమెత్తారు. 
 
'తెలుగు భవిత-సంకల్ప దీక్ష' పేరిట తాను చేపట్టిన నిరసన దీక్షల్లో భాగంగా మంగళవారం అనంతపురం సప్తగిరి కూడలిలో ఆయన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విభజన సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని, రాష్ట్ర ఆర్థిక లోటును కేంద్రమే పూరించాలని డిమాండ్ చేశారు. 
 
హామీలు నెరవేర్చకుంటే ఏపీ భవిష్యత్ అంధకారంగా మారుతుందని చెప్పారు. లక్షలాదిమంది యువత నిరుద్యోగులుగా మారతారని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, ఆర్థిక లోటు భర్తీ, పరిశ్రమల స్థాపన నెరవేర్చాలని జయప్రకాష్ నారాయణ్ కోరారు.