శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 27 నవంబరు 2020 (23:12 IST)

మానవత్వం మరిచి ఎస్సీ రైతులకి సంకెళ్లు వేసి జైళ్లో పెట్టారు: నారా లోకేష్

కృష్ణాయపాలెం ఎస్సీ రైతులకు జగన్ ప్రభుత్వం మానవత్వం మరిచి సంకెళ్లు వేసి జైళ్లోపెట్టిందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. 
 
తమను జగన్ ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తోందంటూ బెయిల్ పై  విడుదలైన రైతులు లోకేశ్ తో సమావేశమై  కన్నీటి పర్యంతమయ్యారు. 
 
వారిని పరామర్శించిన లోకేష్ అన్ని విధాలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. పోలీసులకు ఫిర్యాదు చేసినవారే కంప్లైంట్ వెనక్కి తీసుకున్నా రైతులకు సంకెళ్లు వేయించటం జగన్ రెడ్డి శాడిజానికి పరాకాష్ట అని దుయ్యబట్టారు.
 
 "దాడులు దౌర్జన్యాలెన్నో భరిస్తూ ఎంతకాలమైనా వెన్నుచూప‌ని అమ‌రావ‌తి ప‌రిర‌క్షణ ఉద్యమందే అంతిమ విజ‌యమని లోకేష్ స్పష్టం చేశారు.
 
రైతుల పోరాటానికి తెలుగుదేశం పార్టీ అండ‌గా ఉంటుందని హామీ ఇచ్చారు. అన్నం పెట్టే అన్నదాతలు భూతల్లిని రాజధాని కోసం చేసిన త్యాగాలను లోకేష్ కొనియాడారు. అమ‌రావ‌తిని చంపేసే కుట్రల్ని నిర‌సిస్తూ శాంతియుతంగా ఉద్యమిస్తున్నవాళ్లని గుర్తు చేశారు. 
 
తమ త్యాగాల పునాదుల‌పై ఏర్పడిన ప్రజారాజ‌ధానికి స‌మాధి క‌ట్టొద్దంటూ నిన‌దించిన కృష్ణాయ‌పాలెం రైతులు, మూడుముక్కలాట‌కి మ‌ద్దతుగా వ‌చ్చిన బిర్యానీ ఆర్టిస్టుల్ని అడ్డుకోవ‌డ‌మే నేరంగా ప‌రిగ‌ణించి, ఎస్సీల‌పైనే ఎస్సీ, ఎస్టీ కేసు జగన్ రెడ్డి పెట్టించారని లోకేష్ ధ్వజమెత్తారు.