శుక్రవారం రాత్రి 8.15 నిమిషాలకు యువగళం పాదయాత్ర పునఃప్రారంభం
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువళం పేరుతో చేపట్టిన పాదయాత్రను ఈ నెల 29వ తేదీ శుక్రవారం రాత్రి 8.15 నిమిషాలకు పునఃప్రారంభించనున్నారు. ఈ మేరకు ఆ పార్టీ ఏపీ శాఖ అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడు అధ్యక్షతన జరిగిన పొలిటికల్ యాక్షన్ కమిటీ సమావేశంలో నిర్ణయించారు. ఈ సమావేశం తర్వాత ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, తమ పార్టీ అధినేత చంద్రబాబుపై అక్రమ కేసు బనాయించి అరెస్టు చేసిన సమయంలో నారా లోకేశ్ ఎక్కడ పాదయాత్రను ఆపివేశారో.. అక్కడ నుంచే ఇది ప్రారంభమవుతుందని చెప్పారు.
కక్షసాధింపులే ధ్యేయంగా జగన్ సర్కార్ రోజుకొకటిగా తెరపైకి తెస్తున్న తప్పుడు అంశాలపై ప్రజల్లోనే తేల్చుకోవాలని టీడీపీ పొలిటికల్ యాక్షన్ కమిటీ నిర్ణయించిందని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
'నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రను అడ్డుకోవాలని చూస్తున్నారు. దీనిపై కూడా సమావేశంలో చర్చించాం. చంద్రబాబు అక్రమ అరెస్టుతో నిలిచిపోయిన పాదయాత్రను తిరిగి శుక్రవారం రాత్రి 8.15 నిమిషాల నుంచి రాజోలు నుంచే ప్రారంభించాలని లోకేశ్ తోపాటు మేమంతా ఉమ్మడిగా నిర్ణయం తీసుకున్నాం. పాదయాత్ర కొనసాగింపునకు అన్ని అనుమతులు తీసుకున్నాం' అని అచ్చెన్నాయుడు వెల్లడించారు.