ఈ సమాజం మనల్ని ఒక్కటిగా బతకనివ్వదు.. చనిపోతున్నాం...
వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ జంట బలవన్మరణానికి పాల్పడింది. ఇందులో ప్రియుడు చనిపోగా, ప్రియురాలు ప్రాణాపాయం నుంచి బయటపడింది. ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే.. ప్రియురాలికి వివాహమై ఓ కుమారుడు ఉండగా, భర్తకు దూరంగా జీవిస్తూ వచ్చింది.
ఈ ఘటన చిత్తూరు జిల్లా కుప్పం మండలంలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, కుప్పం మండలం వెండుగంపల్లికి చెందిన రమేష్ (26) అనే యువకుడు ఒంగోలులో టైల్స్ పాలిష్ పని చేస్తుండేవాడు. ఈయన వారంలో ఒక్కరోజు గూడూరులో తన అక్క ఇంటికి వెళ్లి వచ్చేవాడు. ఈ క్రమంలో గూడూరుకు చెందిన సుజాత అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఓ బిడ్డకూడా ఉన్నాడు. అయితే, భార్యాభర్తల మధ్య మనస్పర్థలురావడంతో రమేష్.. ఒంగోలులో పనిమానేసి తమిళనాడు రాష్ట్రంలోని హోసూరులో వంటపనికి వెళ్లసాగాడు.
అక్కడ అక్కడ ఫోన్, సోషల్ మీడియా ద్వారా హోటల్ మేనేజ్‌మెంట్ చేస్తున్న బెంగళూరు పట్టణానికి చెందిన ఓ యువతితో యేడాది కిందట పరిచయమేర్పడింది. అప్పటికే ఆమెకు వివాహమై భర్తతో దూరంగా ఉంటోంది. రమేష్, ఆ యువతి అప్పుడప్పుడు హోసూరు, బెంగళూరు పరిసరాల్లో కలుసుకునేవారు. యువతి ఎవరితోనే తిరుగుతున్నట్లు తెలుసుకున్న ఆమె కుటుంబ సభ్యులు అతన్ని వదిలిపెట్టాలని తీవ్రంగా హెచ్చరించారు. అలాగే, రమేష్ వ్యవహారాన్ని తెలుసుకున్న భార్య, ఆమె కుటుంబ సభ్యులు తీవ్రంగా మందలించారు.
ఈ మందలింపులతో తీవ్ర మనోవేదనకు గురైన వారు... తమను బతకనివ్వరని భావించారు. అందుకే ఇద్దరూ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. మూడు రోజుల క్రితం కుప్పం చేరుకున్నారు. ఆదివారం రాత్రి రమేష్ స్థానికంగా ఉన్న తన మరో అక్క సులోచన ఇంటికి వెళ్లి బంగారుచైను, మొబైల్‌ఫోన్ ఇచ్చి, బావ ద్విచక్ర వాహనాన్ని తీసుకుని, మరలా వస్తానని చెప్పి బయటకు వచ్చాడు.
రాత్రంతా రమేష్, యువతి మద్యం సేవించారు. ఉదయం కుప్పం రైల్వేస్టేషన్ సమీపంలోని మల్దేపల్లి వద్ద రైలు కిందపడి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అక్కడికి చేరుకోగానే రైలు సైతం వచ్చింది. రమేష్ అమాంతం రైలుకింద పడి విగతజీవుడయ్యాడు. యువతికి ధైర్యం చాలక సొమ్మసిల్లి రైలుపట్టాల సమీపంలోనే పడిపోయింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులుస వచ్చి రమేష్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకోగా, అపస్మారక స్థితిలో ఉన్న యువతిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.