జీవితం ఓ నది.. ఆటుపోట్లు సహజం.. అంతిమంగా సమాజానికి ఉపయోగపడాలి : లక్ష్మీనారాయణ
సీబీఐ జాయింట్ డైరక్టర్ లక్ష్మీనారాయణ. ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డిని, కర్ణాటక మంత్రి గాలి జనార్ధన్ రెడ్డిలను ముప్పతిప్పలు పెట్టిన సీబీఐ అధికారి. వీరిద్దరి అక్రమ సామ్రాజ్యాల పునాదులను షేక్ చేశారు. ప్రస్తుతం మహారాష్ట్ర అదనపు డీజీగా విధులు నిర్వహిస్తున్నారు.
ఆకేళ్ల రాఘవేంద్ర ఫౌండేషన్, యువ వారధి ఆధ్వర్యంలో హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో ఏర్పాటు చేసిన ఎంపవర్ టాక్ కార్యక్రమంలో లక్ష్మీనారాయణ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవితం ఒక నదిలాంటిదన్నారు.
ఎందుకంటే నది పుట్టిన దగ్గర నుంచి సముద్రంలో కలిసే వరకు ఎన్నో మలుపులు తిరుగుతూ ఆటుపోట్లు ఎదుర్కొంటూ ముందుకు సాగుతుందని, దాని ప్రయాణంలో ఎందరికో ఉపయోగపడుతుందని గుర్తుచేశారు. అలాగే, మనిషి జీవితం కూడా నదిలాగా ఎన్ని ఆటుపోట్లు వచ్చినా అధిగమించి ముందుకెళ్లడంతో పాటు సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలని ఆయన ఉద్భోదించారు.
మనం చేసే ప్రతి పనిలో పూర్తిగా నిమగ్నమైనప్పుడే ఆనందం పొందవచ్చన్నారు. ప్రతి ఒక్కరికీ చిన్న నాటి పునాదే అన్నింటికి ప్రధానమన్నారు. మంచి పుస్తకాలు చదవాలని, తద్వారా మంచి విషయాలు ఆలోచనలు అలవర్చుకోవచ్చని అభిప్రాయపడ్డారు. చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ.. నలుగురికి మేలు చేసే కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలని సూచించారు.