శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 31 మే 2023 (13:20 IST)

ఉచిత బియ్యం స్థానంలో రాగుల పంపిణీ.. ఎక్కడ?

ration
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేషన్ దుకాణాల్లో ఉచిత బియ్యం స్థానంలో రాగులను పంపిణీ చేయనున్నారు. రాయలసీమలోని కర్నూలు, శ్రీ సత్యసాయి, అనంతపురం జిల్లాల్లోని రేషన్ కార్డులపై ఉచిత బియ్యం, సబ్సిడీ కందిపప్పు, చెక్కరతోపాటు వచ్చే నెల నుంచి రాగులను కూడా పంపిణీ చేయనున్నట్లు పౌరసరఫరాల శాఖ కమిషనర్ హెచ్.అరుణ్ కుమార్ తెలిపారు. 
 
ఉచిత బియ్యానికి బదులు ఒక్కొక్క కార్డుపై గరిష్టంగా 3 కేజీల వరకు రాగులను ఉచితంగానే అందజేస్తామని సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. రాగులు వద్దనుకునే కార్డుదారులు యధావిధిగా మొత్తం బియ్యం తీసుకోవచ్చని వివరించారు. రాయలసీమలోని ఇతర జిల్లాల్లో జూలై నుంచి రాగుల పంపిణీ ప్రారంభిస్తామని, దశలవారీగా రాష్ట్రంలోని ఇతర జిల్లాలకూ విస్తరిస్తామని తెలిపారు. 
 
2023ను మిల్లెట్ సంవత్సరంగా ప్రకటించిన నేపథ్యంలో అధిక పోషక విలువలు కలిగిన బలవర్థకమైన చిరుధాన్యాలను పేదలకు అందించాలనే ఉద్దేశంతో రేషన్ కార్డుదారులకు రాగులు, జొన్నలు పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఇప్పటికే నంద్యాల జిల్లాలో జొన్నలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. వచ్చే నెల నుంచి రాగుల పంపిణీ కూడా చేపట్టనున్నామన్నారు. ప్రజాపంపిణీ వ్యవస్థకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే 1967 టోల్‌ఫ్రీ నెంబరుకు ఫిర్యాదు చేయాలని సూచించారు.