డమ్మీ గన్ను, చాకు, కారంతో స్పందనకు వచ్చిన ఘనుడు!
స్పందన కార్యక్రమానికి ఎవరైనా పిటిషన్ పట్టుకుని వస్తారు. కానీ, ఇతగాడు ఏకంగా గన్ను, చాకు, కారం పట్టుకుని వచ్చాడు. అంతే, పోలీసులు అతడిని పట్టుకెళ్ళారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం కలెక్టరేట్ లోని ఈ రోజు స్పందన కార్యక్రమంలో డమ్మీ గన్ కలకలం రేగింది.
డమ్మీ గన్, చాకు, కారంతో స్పందనకు వచ్చిన ఓ అర్జీదారుడు, వచ్చి కామ్ గా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి కూర్చున్నాడు. ఎందుకో అనుమానం వచ్చి అధికారుల తనిఖీ చేయబోగా, అతడే వాటిని బయటపెట్టాడు. సదరు వ్యక్తి తిరువూరుకు చెందిన కె.అశోక్ గా పోలీసులు గుర్తించారు. అతని నుండి డమ్మీ గన్, చాకు, కారం పొట్లం స్వాధీనం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చిలకలపూడి పోలీసుస్టేషనుకు తరలించారు.
చిలకలపూడి సర్కిల్ ఇన్స్పెక్టర్ అంకబాబు మాట్లాడుతూ, కలెక్టర్ జె. నివాస్ సమక్షంలో నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమంలో అర్జీ సమర్పించేందుకు వచ్చిన తిరువూరుకు చెందిన కె. అశోక్ చౌదరి భూమికి సంబంధించిన సమస్యను కలెక్టరుకు విన్నవించుకునే సందర్భంలో తనకు కొంత సెక్యూరిటీ కావాలంటూ గన్ను, కత్తి, కారప్పొడిని అశోక్ చౌదరి బయట పెట్టాడు. వెంటనే స్పందించి అదుపులోకి తీసుకున్నారు. గన్నుడమ్మీ పిస్టలుగా తేలింది. ఎవరికైనా హాని తలపెట్టేందుకు తీసుకొచ్చాడా? అన్నదానిపై విచారణ చేస్తున్నామని తెలిపారు. విచారణ అనంతరం ఉన్నతాధికారులు, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళి తగు చర్యలు తీసుకుంటామన్నారు.