శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సందీప్ రేవిళ్ళ
Last Modified: సోమవారం, 4 మార్చి 2019 (19:20 IST)

ఆస్తి పంచివ్వలేదని తల్లిదండ్రులపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు...

కన్న కొడుకులకు ఆస్తి పంచితే తమను చూసుకోరనే ఉద్దేశంతో పంపకాన్ని వాయిదా వేసిన తల్లిదండ్రులను, దారుణంగా పెట్రోలు పోసి కాల్చాడు ఓ కొడుకు. వారి హాహాకారాలకు చుట్టుప్రక్కల వారు తరలివచ్చారు. వెంటనే ఆసుపత్రిలో చేర్చారు. ఈ ఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. 
 
కణేకల్‌లోని రామ్‌నగర్ కానీలో కుటుంబంతోపాటు నివసిస్తున్న నారాయణరెడ్డి, నరసమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు. వారికి వంశపార్యంపరంగా వస్తున్న ఒక ఎకరా భూమిని, సొంత ఇంటిని పంచి ఇవ్వలేదని కోపంతో ఉన్నారు. పంచిపెట్టమని వారిపై పదేపదే ఒత్తిడి తేసాగారు. అయితే ఆస్తి పంచితే వారిని బాగా చూసుకోరనే ఉద్దేశంతో తల్లిదండ్రులు పంపకాన్ని వాయిదా వేస్తూవచ్చారు. 
 
ఈ తీరు నచ్చని చిన్న కొడుకు మధుసూదన్ రెడ్డి, తల్లిదండ్రులపై మరింత ఒత్తిడి చేశాడు. వారు ససేమిరా కాదనటంతో కోపానికి లోనయ్యాడు. ఆదివారం వారు ఒంటరిగా ఉండగా వారిపై దాడి చేయడానికి ప్రయత్నించాడు. తనతోపాటు తెచ్చిన పెట్రోలును వారిపై పోసి నిప్పంటించాడు. శరీరం కాలి వారు బాధతో అరుస్తుంటే చుట్టుప్రక్కల వారు పరుగున వచ్చారు. వెంటనే మంటలు ఆర్పి బాధితులను బళ్లారి ఆసుపత్రికి తరలించారు. ఇప్పుడు పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు చెప్పారు. దాడికి దిగిన మధుసూదన్‌రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.