సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 23 డిశెంబరు 2019 (15:45 IST)

మా ఎమ్మెల్యే కనిపించడం లేదు : మంగళగిరి ఠాణాలో రైతుల ఫిర్యాదు

గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే ఆర్. రామకృష్ణారెడ్డి (మంగళగిరి) కనిపించలేదంటూ ఆ నియోజకవర్గ ప్రజలు స్థానిక పోలీస్ స్టేషనులో ఫిర్యాదుచేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానులు ఉండవచ్చునంటూ సీఎం జగన్ చేసిన ప్రకటనతో రాజధాని ప్రాంతం ఆందోళనలతో అట్టుడికిపోతున్న విషయం తెల్సిందే. 
 
గత మూడు రోజులుగా రాజధాని ప్రాంత రైతులు తీవ్రస్థాయిలో ఆందోళనలు చేస్తున్నారు. అయితే ఈ ఆందోళన జరుగుతున్న నాటి నుంచి ఎమ్మెల్యే ఆర్కే కనిపించట్లేదని రైతులు చెబుతున్నారు. ఈ క్రమంలో మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఆర్కే కనిపించట్లేదని.. ఆయన్ను వెతికిపెట్టాలని పోలీసులకు.. రైతులు, కూలీలు ఫిర్యాదు చేశారు. 
 
"రాజధానిపై నెలకొన్న సందిగ్దతపై మా గోడు వెళ్లబుచ్చుకుందామంటే మా ఎమ్మెల్యే ఎక్కుడున్నారో తెలియట్లేదు. మా ఎమ్మెల్యే కోసం తీవ్ర ఆందోళన చెందుతున్నాం. మీరు వెంటనే తగు చర్యలు తీసుకుని మా శాసన సభ్యులను మాకు అప్పగిస్తారని భావిస్తున్నాం. గత వారం రోజుల నుంచి మంగళగిరి నియోజకవర్గంలో గానీ.. ఆయన కార్యాలయంలోగానీ.. నివాసంలో గానీ ఎక్కడా ఆయన కనిపించట్లేదు. మా సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదు. కావున వెంటనే ఆయన్ను వెతికి మాకు అప్పగించాల్సిందిగా కోరుతున్నాము" అని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు పత్రంలో రాజధాని రైతులు, కూలీలు సంతకాలు కూడా చేశారు. ఈ ఫిర్యాదుపై పోలీసులు ఏ విధంగా స్పందిస్తారో వేచిచూడాల్సిందే.