శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 5 డిశెంబరు 2023 (22:08 IST)

మిచౌంగ్ తుఫాన్ బీభత్సం: తక్షణం రూ. 5000 కోట్ల సాయం అందించాలంటూ తెదేపా ఎంపీ విజ్ఞప్తి

మిచౌంగ్ తుఫాన్ బీభత్సంతో చేతికి వచ్చిన వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని తెలుగుదేశం పార్టీ ఎంపీ పార్లమెంటులో ప్రస్తావించారు. తక్షణ సాయంగా రూ. 5000 కోట్లు ఇచ్చి రైతులను ఆదుకోవాలని కోరారు. ఆంధ్రప్రదేశ్‌లో తుఫాను భారీ వర్షాలు రైతులను తీవ్రంగా నష్ట పరిచిందని చెప్పారు. రోడ్లు, విద్యుత్ సరఫరా వ్యవస్థ దెబ్బతిన్నదనీ, దయచేసి ఏపీకి తాత్కాలిక సహాయంగా రూ.5000 కోట్లు ఇచ్చి ఆదుకోవాలని ప్రధాని మోదీకి టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ విజ్ఞప్తి చేసారు.
 
తీరం దాటిన తుఫాన్
బాపట్ల జిల్లా సూర్యలంక తీరం వద్ద మిచౌంగ్ పెనుతుఫాను తీరాన్ని పూర్తిగా దాటింది. ఈ మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు తీరాన్ని తాకిన పెనుతుఫాన్, పూర్తిగా తీరాన్ని దాటేందుకు రెండు గంటల సమయం పట్టింది. మధ్యాహ్నం రెండున్నరకు తీరాన్ని పూర్తిగా దాటింది. దీని ప్రభావంతో బాపట్ల తీరం వద్ద సముద్రం 20 అడుగులు ముందుకు వచ్చింది. సుమారు 100 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచాయి. కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
 
తీరం దాటిన తుఫాను ప్రస్తుతం బాపట్లకి 15 కి.మీ దూరంలోనూ ఒంగోలుకి ఈశాన్యంగా 40 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై వున్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ పెనుతుఫాన్ ఉత్తర దిశగా ప్రయాణం చేసి క్రమంగా బలహీనపడుతుందని తెలిపారు. మరోవైపు దీని ప్రభావంతో పశ్చిమ ఆంధ్ర, దక్షణ తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.