బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 3 డిశెంబరు 2021 (09:00 IST)

గత చంద్రబాబు సర్కారు వల్లే పోలవరం పూర్తికాలేదు : మంత్రి అనిల్ కుమార్

పోలవరం ప్రాజెక్టును తాము అనుకున్న సమయానికి పూర్తిచేయలేక పోవడానికి ప్రధాన కారణం గత చంద్రబాబు ప్రభుత్వమేనని రాష్ట్ర జలవనరుల శాఖామంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. 2021 డిసెంబరు ఒకటో తేదీ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తానని ఆయన అసెంబ్లీ వేదికగా సాక్షిగా ప్రకటించారు. కానీ, డిసెంబరు ఒకటో తేదీ వెళ్లిపోయింది. దీంతో మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌ను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో ట్రోల్స్ ప్రారంభమయ్యాయి. 
 
వీటిపై అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ, 2021 డిసెంబరు ఒకటో తేదీ నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని గతంలో చెప్పిన మాట నిజమేనన్నారు. అయితే, గత తెదేపా ప్రభుత్వం చేసిన తప్పిదాల కారణంగానే ప్రాజెక్టును అనుకున్న సమయానికి పూర్తి చేయలేకపోయామని ఆయన చెప్పారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు. గత ప్రభుత్వం స్పిల్ వే, కాఫర్ డ్యామ్ నిర్మాణాలను ఒకేసారి చేపట్టిందని, అదీ కూడా సగం మాత్రమే పూర్తి చేసిందని చెప్పారు. 
 
అయితే, గత యేడాది సంభవించిన వరదల కారణంగా డయాఫ్రమ్ వాల్, దిగువన ఉన్న కాఫర్ డ్యామ్ కూడా బాగా దెబ్బతిందన్నారు. రెండు కిలోమీటర్ల నదిలో పోవాల్సిన వరదను మార్చి పంపడంతోనే డ్యామ్ దెబ్బతిన్నదని వివరించారు. అలాగే, ఇతర సాంకేతిక అంశాల కారణంగా కూడా ఈ ప్రాజెక్టును పూర్తి చేయలేక పోయామని ఆయన వెల్లడించారు.