శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 13 మార్చి 2020 (08:24 IST)

మారుతీ రావు ఆత్మహత్య కేసులో కారు డ్రైవర్ హస్తం?

తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ పరువు హత్య కేసులో ప్రధాన నిందితుడైన రియల్టర్ మారుతీ రావు ఆత్మహత్య కేసులో కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. మారుతీ రావు కారు డ్రైవర్‌పై అనుమానం వ్యక్తం చేస్తున్న పోలీసులు.. డ్రైవర్ మొబైల్ కాల్ డేటాను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే మారుతీ రావు కాల్ డేటాను సేకరించిన విషయం తెల్సిందే. 
 
ఈ కేసులో మారుతీ రావు కారు డ్రైవర్ రాజేశ్‌ను సైఫాబాద్ పోలీసులు ప్రశ్నించారు. ఈ సందర్భంగా పలు కీలక విషయాలు వెల్లడించినట్టు తెలుస్తోంది. మిర్యాలగూడ నుంచి బయల్దేరిన తర్వాత మార్గమధ్యంలో ఉన్న ఓ పెస్టిసైడ్స్ షాపు వద్ద మారుతీరావు ఆగాడని అయితే, దుకాణంలోకి వెళ్లకుండానే వెనక్కి వచ్చాడని రాజేశ్ వివరించాడు. 
 
మారుతీరావుకు ఆ షాపు పరిచయమేనని, తరచూ అక్కడికి వెళ్లి కూర్చునేవారని పోలీసులకు తెలిపాడు. ఆర్యవైశ్య భవన్‌కు చేరుకున్నాక ఇద్దరం కలిసి బయటకు వెళ్లి టిఫిన్ చేశామని తెలిపాడు. ఆర్యవైశ్య భవన్‌కు చేరుకున్నాక తనను బయటకు పంపి ఆయనకు ఇష్టమైన గారెలు తెప్పించుకుని తిన్నాడని వివరించాడు. 
 
అనంతరం తాను కూడా అదే గదిలో నిద్రపోతానని చెప్పినా ఒప్పుకోలేదని, కిందికి వెళ్లి కారులో  పడుకోమని చెప్పడంతో వెళ్లిపోయానని పోలీసులకు తెలిపాడు. కాగా, ఇప్పటికే మారుతీరావు కాల్‌డేటాను సంపాదించిన పోలీసులు, రాజేశ్ కాల్‌డేటాను కూడా పరిశీలించాలని నిర్ణయించారు. అలాగే, మరోమారు అతడిని విచారించనున్నట్టు తెలుస్తోంది.