పెళ్లి కూతురి దుర్మరణం విచారకరం...వెస్ట్ చర్చి బ్రిడ్జి బాగు చేస్తాం...
కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఓ పెళ్లి బృందం అర్ధ రాత్రి తిరుపతి వెస్ట్ చర్చి వద్ద వరద నీటిలో చిక్కుకుని పెళ్లి కూతురు మృతి చెందిన సంఘటన అందరినీ కలచివేస్తోంది. ఆ ప్రాంతాన్ని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి పరిశీలించారు. తిరుపతి నగర మేయర్ డాక్టర్ శిరీషా కమిషనర్ పీ.ఎస్ గిరీషా తో కలిసి శనివారం ఉదయం భూమన చేరుకుని పరిశీలించారు. అధికారుల ద్వారా సంఘటన వివరాలను తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో భూమన కరుణాకర రెడ్డి మాట్లాడారు. స్థానిక వెస్ట్ చర్చి వద్ద చోటు చేసుకున్న సంఘటన చాలా బాధాకరమైన విషయమని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతిలో మోకాళ్ల లోతు నీళ్లు పోవడమే చాలా కస్టమని, అలాంటిది రాత్రి కురిసిన వర్ధనికి అర్ధ గంటలోపే బ్రిడ్జి దగ్గర దాదాపు ఎనిమిది తొమ్మిది అడుగుల పైన నీళ్ళు చేరిపోయాయని తెలిపారు. సరిగ్గా అదే సమయానికి కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఒక పెళ్లి బృందం తమ వాహనంలో చేరుకున్నారని... డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా వాహనంలో ఉన్న పెళ్లి కూతురు ప్రాణాలు కోల్పోవడం జరిగిందన్నారు.ఈ సంఘటన జరిగిన మరో పదిహేను నిమిషాల్లోనే బ్రిడ్జి కింద నీరు తగ్గిపోయిందని వివరించారు.
మీడియా ప్రతినిధులు అడిగిన ఓ ప్రశ్నకు ఎమ్మెల్యే భూమన బదులిస్తూ... గతంలో ఎన్నడూ ఇలాంటి విషాదం చోటు చేసుకోలేదని స్పష్టం చేశారు. భవిష్యత్ లో ఇలాంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా ప్రత్యేక ప్రణాళికలు చేపడుతామని వెల్లడించారు. ముఖ్యంగా బ్రిడ్జి కింది భాగంలో ఎత్తు పెంచడం , వరద నీటి కాలువల్లో పూడిక తీయించడం వంటి ప్రత్యామ్నాయ చర్యలు చేపడతామని భూమన పేర్కొన్నారు.