శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Updated :విజయవాడ , బుధవారం, 18 ఆగస్టు 2021 (16:40 IST)

చంద్రబాబుది ఎప్పుడూ యాంటీ మైనార్టీ స్టాండే: ఎమ్మెల్యే హ‌ఫీజ్ ఖాన్

తాను అధికారంలో ఉండగా, ఏనాడూ మైనార్టీలను పట్టించుకోని చంద్రబాబు నాయుడు.. తన రాజకీయ ప్రయోజనాల కోసం ఇప్పుడు శవ రాజకీయాలు చేస్తున్నారని కర్నూలు వైయస్సార్‌ సీపీ ఎమ్మెల్యే హఫీజ్‌ ఖాన్‌ మండిపడ్డారు.

కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం ఎర్రమడుగు గ్రామానికి చెందిన హజీరాబీ అనుమానాస్పద మృతిపై ప్రభుత్వం అన్నికోణాల్లో విచారణ చేపట్టిందని తెలిపారు. హజీరాబీ మరణంపై విచారణ వేగంగా జరుగుతోందని, విచారణ పూర్తి కాగానే నిందితులు ఎంతటివారైనా శిక్ష పడుతుందని తెలిపారు.

అయితే నారా లోకేష్‌ చావులను కూడా రాజకీయం చేస్తూ మైనార్టీలపై లేని ప్రేమను చూపిస్తున్నారని విమర్శించారు. ఎమ్మెల్యే హఫీజ్‌ ఖాన్‌ కర్నూలులోని జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. టీడీపీ హయాంలో మైనార్టీలు, దళితులపై లెక్కలేనన్ని దాడులు జరిగాయి. ఈ విషయాన్ని నారా లోకేష్‌ తెలుసుకోవాలి. మీ నాయన అధికారంలో ఉన్పప్పుడు యాంటీ మైనార్టీ స్టాండ్‌ తీసుకున్న వారితో కలిసి ప్రభుత్వంలో పని చేశారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ కేబినెట్‌లో కూడా ఒక మైనార్టీ మంత్రి ఉంటే, అదే చంద్రబాబు మంత్రివర్గంలో ఒక్క మైనార్టీకి అయినా చోటు దక్కిందా? ఆ ఘనత మీ నాయనది, మీది కాదా లోకేష్‌? ముస్లిం మైనార్టీలపై మీకున్న చిత్తశుద్ధి ఇదేనా అని ప్రశ్నించారు.

హజీరాబీది హత్య అని తెలిసింది, పోస్ట్‌మార్టం నివేదిక ద్వారానే. అయితే పొలం పనులకు వెళ్లిన ఆ అమ్మాయి సహజ మరణం పొందిందని, అంతకు ముందు ఆమె కుటుంబీకులు దహన సంస్కారాలు చేస్తుంటే, పోలీసులు ఈ ఘటనపై పోస్ట్‌మార్టం జరగాల్సిందేనని పట్టుబట్టారు. ఆ పోస్ట్‌మార్టంలో సహజ మరణం కాదని, హత్య జరిగిందని తేలడంతో దీనిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. అయితే విచారణలో కొంచెం ఆలస్యం జరిగినా, కచ్చితంగా న్యాయం జరుగుతుంది. ఎవరైతే తప్పు చేశారో వారికి కఠినంగా శిక్ష కూడా పడుతుంది. క్లిష్టతరమైన ఈ కేసును పోలీసులు జాగ్రత్తగా విచారణ చేస్తుంటే, మీరు శవ రాజకీయాలు చేస్తారా? అని ఎమ్మెల్యే హ‌ఫీజ్ ఖాన్ విమ‌ర్శించారు.

ఇదే తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు అణగారిన వర్గాలను కించపరిచి, రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా తొక్కిపెట్టారు‌. గుంటూరు నారా హమారా సభలో మైనార్టీ యువకులు తమ హక్కుల కోసం పోస్టర్లు చూపించి అడిగినందుకు నంద్యాల యువకులపై దేశద్రోహం కేసులు పెట్టించింది మీరు కాదా..ఆంధ్రప్రదేశ్ లో అమలు చేస్తున్న దిశ చట్టం యొక్క తీరుతెన్నులను పరిశీలించి, ఈ చట్టాన్ని తమ రాష్ట్రాల్లో కూడా తీసుకువచ్చే ప్రయత్నం ఆయా రాష్ట్రాలు చేస్తున్నాయి. దిశ చట్టాన్ని చేయాలని కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాల్సింది పోయి అడ్డగోలుగా మాట్లాడతారా? లోకేష్.. ఎమ్మెల్యేగా గెలవలేదు. సర్పంచ్ గా కూడా పోటీ చేయలేదు. ప్రజల్లో గెలవలేని లోకేష్ కు ముఖ్యమంత్రిని విమర్శించే అర్హత ఎక్కడిది? అని ప్ర‌శ్నించారు.

చంద్రబాబు కొడుకు లోకేష్ కు ఎమ్మెల్సీని చేసి మంత్రిని చేశాడు కానీ, అదే షరీఫ్‌కు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేకపోయారు? నంద్యాల ఉప ఎన్నికలు వచ్చేవరకూ ఫారుఖ్‌కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వలేదు? మరి ఆయనకు ఎందుకు మంత్రి పదవి ఇవ్వలేదు? ఒక్క మైనార్టీకైనా మంత్రి పదవి ఇచ్చారా చంద్రబాబూ? మీరు ఏరోజు అయినా మైనార్టీ ప్రజలు మంచిగా ఉండాలని ఆలోచన చేశారా? ఎంతసేపటికీ మైనార్టీలను మభ్యపెట్టి, వారి మైండ్ సెట్ ను డైవర్ట్‌ చేయడానికి ప్రయత్నిస్తారు తప్పితే ఏరోజూ మంచి చేద్దామనే ఆలోచనే మీకు లేద‌ని ఎమ్మెల్యే విమ‌ర్శించారు.