అగ్రి గోల్డ్ అక్రమాలకు సూత్రధారి చంద్రబాబే: ఎమ్మెల్యే శ్రీదేవి
ఎంతో మంది మధ్యతరగతి మదుపరులను క్షోభ పెట్టిన అగ్రిగోల్డ్ అక్రమాలకు ప్రధాన సూత్రధారి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే అని తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఆరోపించారు. అమరావతిలో ఆమె మీడియాతో మాట్లాడుతూ, అగ్రి గోల్డ్ అక్రమాలకు సూత్రధారి చంద్రబాబే అన్నారు.
300 మంది బాధితుల ఆత్మహత్యకు కారణం గత ప్రభుత్వమే అని, చంద్రబాబు చేసిన తప్పులను సీఎం జగన్ మోహన్ రెడ్డి సరిదిద్దుతున్నారని చెప్పారు.1996లో అగ్రిగోల్డ్ కు అనుమతులు ఇచ్చింది అప్పటి చంద్రబాబు ప్రభుత్వమే అని, అగ్రిగోల్డ్ బోర్డు తిప్పింది.. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే అని పేర్కొన్నారు. అగ్రి గోల్డ్ ఆస్తులపై తెలుగుదేశం పార్టీ నేతలు కన్నువేసి, వాటిని కాజేశారని, వైఎస్ జగన్ పాద యాత్రలో అగ్రి గోల్డ్ బాధితులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారని గుర్తు చేశారు.
ఇచ్చిన మాట ప్రకారం రూ.10 వేల లోపు బాధితులకు ఇప్పటికే న్యాయం చేశారని, రేపు రూ.20 వేల లోపు బాధితులకు రూ.500 కోట్లతో న్యాయం చేసేందుకు సిద్దమయ్యారని వివరించారు. చంద్రబాబు చేసిన పాపాలను, సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రక్షాళన చేసి న్యాయం చేస్తున్నారని ఎమ్మెల్యే శ్రీదేవి వివరించారు.