గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 30 జూన్ 2021 (08:15 IST)

ఏపీలో ఎమ్మెల్యేలు చైర్మన్లుగా అసైన్డ్ కమిటీలు

రాష్ట్రంలో నిరుపేదలకు భూ పంపిణీ నిమిత్తం ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు చైర్మన్లు గా  అసైన్ మెంట్ కమిటీలు ఏర్పాటు చేసే ప్రతిపాదనను పరిశీలిస్తున్నామని, విషయాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళతామని ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూ శాఖ) ధర్మాన కృష్ణదాస్ తెలిపారు.

సమగ్ర భూ రీ సర్వేతో దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న భూ వివాదాలకు పరిష్కారం లభిస్తుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో తొలిసారిగా 1954లో పేదలకు భూములు పంపిణీ చేశారన్నారు. అప్పటి నుంచి 2014 వరకూ 33,29,908 ఎకరాలు పంపిణీ చేశారన్నారు.

అనంతరం ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ, రాష్ట్రంలో నిరుపేదలకు భూ పంపిణీ చేయడానికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారన్నారు. దీనిలో భాగంగా ఎమ్మెల్యే అధ్యక్షతన నియోజకవర్గ స్థాయిలో అసైన్ మెంట్ కమిటీలు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఎమ్మెల్యేల అధ్యక్షతన అసైన్ మెంట్ కమిటీలు ఉండేవన్నారు. తరవాత కాలంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి చైర్మన్ గా జిల్లా స్థాయి అసైన్ మెంట్ కమిటీలు ఏర్పాటయ్యాయన్నారు. ఎమ్మెల్యేల నేతృత్వంలో అసైన్ మెంట్ కమిటీలు ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.

ఈ కమిటీలు ఆయా నియోజకవర్గాల్లోని నిరుపేదలను గుర్తించి భూ పంపిణీకి అర్హులుగా వారి పేర్లను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తారన్నారు. రాష్ట్ర చరిత్రలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే అత్యధికంగా నిరుపేదలకు భూములు పంపిణీ చేశారన్నారు. 2014 నుంచి గత ప్రభుత్వ హయాంలో భూ పంపిణీ చేయలేదన్నారు.

సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి భూ పంపిణీకి శ్రీకారం చుడుతున్నారన్నారు. దీనిలో భాగంగా ఎమ్మెల్యేల నేతృత్వంలో అసైన్ మెంట్ కమిటీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారన్నారు. సమగ్ర భూ రీ సర్వే ద్వారా శాశ్వత భూ సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా 62 వేల ఎకరాల్లో ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తున్నామన్నారు. ఇళ్ల స్థలాల కోసం ప్రైవేటు వ్యక్తుల నుంచి రూ.9,900 కోట్లు వెచ్చించి 25 వేల ఎకరాలకు పైగా కొనుగోలు చేశామన్నారు.