ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 28 మే 2021 (19:37 IST)

వ్యాక్సినేషన్ తోనే కరోనా నియంత్రణ సాధ్యం: ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి

కరోనా నియంత్రణ ఒక్క వ్యాక్సినేషన్ తోనే సాధ్యమని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. నియోజకవర్గంలో  చేపట్టిన వ్యాక్సినేషన్ ప్రక్రియ పట్ల ఎమ్మెల్యే చెవిరెడ్డి శుక్రవారం టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అధికారులతో సంభాషిస్తూ.. కరోనా నియంత్రణకు ఆయా మండల అధికారులు పకడ్బందీగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

కరోనా కేసులు అత్యధికంగా ఉన్న పంచాయతీలలో ప్రత్యేకంగా దృష్టి సారించాలని సూచించారు. కేసులు తగ్గే వరకు మెరుగైన వైద్య సేవలు అందించి చొరవ తీసుకోవాలని తెలిపారు. పారిశుద్ధ్యం మెరుగ్గా ఉండేలా చూసుకోవాలని తెలియజేశారు. కరోనా కేసుల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలని, ప్రజల్లో కరోనా పట్ల మరింత అవగాహన కల్పించాలని ఎమ్మెల్యే సూచించారు.

కరోనా లక్షణాలు ఉండి.. పరీక్షలు చేయించుకోకుండా నిర్లక్ష్యంగా తిరిగే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. కరోనా బారిన పడిన ప్రజలకు మెరుగైన వైద్య సహాయానికి అవసరమైన సలహాలు, సూచనలు అందించాలని తెలియజేశారు. అలాగే కరోనా నివారణకు ఉచితంగా పంపిణీ చేస్తున్న కిట్లు అందరికీ అందించాలన్నారు.
 
గత రెండు రోజులుగా నిర్వహిస్తున్న వ్యాక్సినేషన్ ఎంత మేరకు సాగింది.. ప్రజల్లో ఏ మేరకు అవగాహన ఉంది అన్న అంశంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. తిరుపతి రూరల్ మండలంలో దానినేడు పీ హెచ్ సి పరిధిలో 1500 మందికి, మంగళం పీ హెచ్ సి పరిధిలో 440 మందికి వ్యాక్సినేషన్ తో 97 శాతం పూర్తయిందని ఎంపిడిఓ వెంకట నారాయణ తెలిపారు.

వేంకటపతి నగర్ 89, ధనలక్ష్మి నగర్ 67, పేరూరు 73, తిరుచానూరు 67, మంగళం 47, అవిలాల 30 అత్యధికంగా కరోనా కేసులు నమోదయ్యాయని వివరించారు. అలాగే చంద్రగిరి మండల పరిధిలో 1800 మందికి, చిన్నగొట్టిగల్లు మండలం, యర్రా వారిపాలెం మండలంలో 1185 మందికి, పాకాల మండలంలో 1697 మందికి, ఆర్సీ పురం మండలంలో 1697 మందికి వ్యాక్సినేషన్ పూర్తయిందని ఆయా మండల ఎంపిడిఓ లు తెలియజేశారు.

పాకాల మండలంలో మోగరాల, ముద్దినాయని పల్లి, పదిపట్లబైలు ప్రాంతాల్లో అత్యధికంగా ఉన్న కరోనా కేసుల నియంత్రణకు ప్రత్యేకంగా చొరవ తీసుకున్నట్టు ఎంపిడిఓ తెలియజేశారు.  ఈ సమీక్షలో ఎంపిడిఓ లు రాధమ్మ, సుశీల దేవి, అమరనాథ్, మురళీ మోహన్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, వెంకట నారాయణ తదితరులు పాల్గొన్నారు.