సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 15 నవంబరు 2019 (19:05 IST)

వంశీ, నారా లోకేష్ మాటల యుద్ధం

టిడిపి బహిష్కృత నేత వల్లభనేని వంశీ, టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్ మధ్య మాటల యుద్ధం జోరుగా కొనసాగుతున్నది.. ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు.

వర్ధంతి, జయంతి తేడా తెలియని వ్యక్తి చెబితే నేను వినాలా అంటూ వంశీ చేసిన కామెంట్స్ పై నారా లోకేష్ తీవ్రంగా స్పందించారు.. పొరపాటుగా దొర్లిన పదాలపై రాద్ధాంతం ఏమిటని ప్రశ్నించారు.. 2009లో జరిగిన ఒక సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ తో జరిగిన కొన్ని పరిణామాలను ఇప్పుటి రాజకీయాలతో ముడిపెట్టడం ఎందుకంటూ వంశీని నిలదీశారు లోకేష్.

కాగా, టీడీపీ అనుబంధ సోషల్ మీడియా పేజీల్లో తనపై దుష్ప్రచారం జరుగుతోందని విజయవాడ పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావుకు ఫిర్యాదు చేశారు వంశీ. తనను అవమానపర్చేలా అమ్మాయిల పేర్లతో ఫొటోలు మార్ఫింగ్ చేస్తూ అసభ్యకరమై పోస్టులు పెడుతున్నారని వంశీ ఆరోపించారు.

దీనిపై చర్యలు తీసుకుని బాధ్యులను శిక్షించాలని సీపీని కోరారు. తనను నేరుగా ఎదుర్కోలేక ఇలాంటి అనైతిక చర్యలకు దిగుతున్నారని మండిపడ్డారు. తన రాజకీయ భవిష్యత్ కాలరాయాలని కొందరు ప్రయత్నిస్తున్నారని, కనీస మానవత్వం లేకుండా తన కుటుంబాన్ని కూడా కించపరిచేలా వ్యవహరిస్తున్నారని వంశీ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

నారా లోకేష్‌కి అనుబంధంగా పనిచేస్తున్న టీడీపీ సోషల్ వింగ్ వాటిని నిర్వహిస్తున్నదని కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.. దీనికి  నారా లోకేష్ సమాధానం చెబుతూ అటువంటి వెబ్ సైట్స్ ఏమీ తాను నడపడం లేదని తేల్చి చెప్పారు.

అలాగే పార్టీ నుంచి బహిష్కరించడంతో వెంటనే ఎమ్మెల్యే పదవికి వంశీ రాజీనామా చేయాలని నారా లోకేష్ నెల్లూరులో జరిగిన మీడియా సమావేశంలో కోరారు. కేవలం ఆస్తులు కాపాడుకోవడం కోసమే వైసిపిలో వంశీ చేరుతున్నారని, అతడికి ఏ మాత్రం సిగ్గు ఉన్నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

గన్నవరంలో తిరిగి గెలవలేననే భయంతోనే వంశీ ఎమ్మెల్యే పదవిని ఒదులుకోవడం లేదని లోకేష్ ఆరోపించారు.. ఇదిలా ఉంటే చంద్రబాబు నాయుడు తనను సస్పెండ్ చేయడంపై వంశీ ఘాటుగా బదులిచ్చారు. ‘చంద్రబాబునాయుడు నన్నేమి సస్పెండ్ చేస్తాడు, తన భవిష్యత్ తను చూసుకోవాలి ఫస్ట్’ అని వ్యాఖ్యానించారు.

చంద్రబాబునాయుడు ఎక్కువ ఊహించుకోకుండా తక్కువ మాట్లాడితే మంచిదని సూచించారు. టీడీపీకి రాజీనామా చేస్తున్నానని ఇప్పటికే ప్రకటించిన తర్వాత సస్పెండ్ చేయడం ఏమిటని చంద్రబాబుని నిలదీశారు.

పార్టీ వాళ్ల పరువు వాళ్లు కాపాడుకోవడానికే తనను సస్పెండ్ చేసినట్లు ప్రకటన చేశారని వివరించారు.  ‘చంద్రబాబు నన్ను సస్పెండ్ చేసేందేంటి, అంత సీన్ లేదు’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.