గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్

వైఎస్ వివేకా కేసు : ఆ రోజు ఏం జరిగిందంటే... వైఎస్ అవినాష్ వీడియో సందేశం

YS Avinash Reddy
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగిన రోజున ఏం జరిగిందన్న విషయాన్ని ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప వైకాపా ఎంపీ, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సోదరుడు వైఎస్ అవినాష్ రెడ్డి ఒక వీడియో ద్వారా మరోమారు వివరించారు. లైవ్ వీడియోలో మాట్లాడుతూ, పలు ఆరోపణలు చేశారు. వివేకా చనిపోయిన విషయం తనకు శివప్రకాశ్ రెడ్డి ఫోన్ చేసి చెప్పారని తెలిపారు. ఉదయం 6.30 గంటల ప్రాంతంలో శివప్రకాశ్ తనకు ఫోన్ చేశారని, అప్పటికే తాను జమ్మలమడుగు బయలుదేరానని వివరించారు.
 
జీకే కొండారెడ్డి అనే వ్యక్తిని వైకాపాలో చేర్చుకునే కార్యక్రమం కోసం ఆ రోజున ఉదయమే అక్కడకు బయలుదేరాను. అక్కడే బ్రేక్ ఫాస్ట్ కూడా ఏర్పాటు చేశారు. పులివెందుల రింగ్ రోడ్డు దగ్గర్లో ఉండగా శివప్రకాశ్ రెడ్డి నుంచి ఫోన్ వచ్చింది. వెంటనే వివేకా ఇంటికి వెళ్లాలని చెప్పడంతో ఎందుకు, ఏం జరిగిందని అడిగాను. వివేకా ఇకలేరని చెప్పడంతో హుటాహుటిన ఇంటికి వెళ్లాను. 
 
అప్పటికేఅక్కడ వివేకా పీఏ కృష్ణారెడ్డి ఉన్నారు. బాత్రూమ్‌లో ఉన్న మృతదేహాన్ని చూపించారు. అనుమానాస్పదంగా ఏమైనా కనిపించాయా అని అడిగితే లేదని చెప్పాడు. వాస్తవానికి నేను అక్కడికి వెళ్లక ముందే అక్కడున్న లెటర్, మొబైల్ ఫోన్ మాయమయ్యాయి. వీటి గురించి పీఏ కృష్ణారెడ్డి వివేకా కూతురు, అల్లుడికి సమాచారం ఇచ్చాడు. వివేకా అల్లుడు ఈ రెండింటిని దాచేయాలని కృష్ణారెడ్డికి సూచించాడు అని వివరించారు. 
 
ఆ తర్వాత సీఈ శంకరయ్యకు ఫోన్ చేసి వివేకానందరెడ్డి చనిపోయారు.. మీరు తొందరగా రండి అని చెప్పాను. ఎలా చనిపోయాడని సీఐ అడిగితే తెలియదు సర్.. కానీ బెడ్రూమ్‌లో బాత్ రూంలో కూడా బాగా రక్తం ఉందని చెప్పాను అని అవినాష్ రెడ్డి తెలిపారు. 
 
ఈ కేసులో ఆది నుంచి అనేక సందేహాలు ఉన్నాయని అవినాష్ అంటున్నారు. 
 
వివేకా చనిపోవడానికి ముందు రాసిన లెటర్ గురించి ఆయన కూతురు సునీత పోలీసులకు ఎందుకు చెప్పలేదు?
కారు డ్రైవర్ ప్రసాద్‌ను వదిలిపెట్టొద్దంటూ వివేకా సర్ లెటర్‌లో సూచించడంతో జరిగింది హత్యేనని స్పష్టంగా తెలిసిపోతోంది. అయినా లెటర్ దాయాలని ఎందుకు చెప్పారు?
 
ఈ కేసులో ఎంతో కీలకమైన ఈ లెటర్‌ను సీబీఐ ఎందుకు డౌన్ ప్లే చేస్తోంది? సీబీఐ అధికారి రాంసింగ్ ఎవరిని కాపాడాలని చూస్తున్నారు?
సీబీఐ విచారణలో కూడా సునీత రెండు వేర్వేరు స్టేట్ మెంట్లు ఇచ్చింది. మొదటి స్టేట్ మెంట్‌లో తప్పులను కవర్ చేసుకుంటూ రెండో స్టేట్ మెంట్ ఇచ్చింది. ఆమెకు అధికారులు అంత సమయం ఇస్తున్నారు. ఎందుకు? అని ప్రశ్నించారు.