మంగళవారం, 5 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 19 ఏప్రియల్ 2023 (12:47 IST)

వివేకా హత్య కేసు : సీబీఐ విచారణకు హాజరైన కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి

ys avinash - ys viveka
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో కడప వైకాపా ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి బుధవారం హైదరాబాద్ నగరంలోని సీబీఐ కార్యాలయంలో సీబీఐ అధికారుల ఎదుట హాజరయ్యారు. తెలంగాణ హైకోర్టు ఆదేశం మేరకు ఆయన వద్ద ఆరు రోజుల పాటు సీబీఐ అధికారులు విచారణ జరుపనుంది. అయితే, విచారణ సందర్భంగా వీడియో, ఆడియో రికార్డు చేయాలని కోర్టు ఆదేశించింది. 
 
వివేకా హత్య కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిలు ఉన్నారు. వీరిలో భాస్కర్ రెడ్డిని సీబీఐ అధికారులు ఆదివారం తెల్లవారుజామున అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో అరెస్టు భయంతో అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఆయనను ఈ నెల 25వ తేదీ వరకు అరెస్టు చేయొద్దంటూ ఆదేశించింది. అదేసమయంలో సీబీఐ విచారణకు హాజరుకావాలంటూ అవినాష్‌ను కోర్టు ఆదేశించింది. 
 
ఈ నేపథ్యంలో ఆయన బుధవారం ఐదోసారి ఆయన సీబీఐ విచారణకు వెళ్లారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసం నుంచి బయల్దేరి కోఠిలోని సీబీఐ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ నెల 25వ తేదీ వరకు సీబీఐ కార్యాలయంలో ప్రతి రోజూ విచారణకు హాజరుకావాలని షరతు విధించింది. అవినాష్‌కు ప్రశ్నలను రాతపూర్వకంగా ఇవ్వాలని.. విచారణను ఆడియో, వీడియో రికార్డు చేయాలని సీబీఐకి ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 25న తుది ఉత్తర్వులు జారీ చేస్తామంటూ విచారణను వాయిదా వేసింది.