1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , బుధవారం, 3 నవంబరు 2021 (16:13 IST)

చంద్ర‌బాబుకు కావాల్సింది స్టేట్ కాదు... రియల్ ఎస్టేట్!

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ శ్రీ నందిగం సురేష్ మీడియాతో  మాట్లాడుతూ, చంద్ర‌బాబుకు కావాల్సింది స్టేట్ కాదు... రియల్ ఎస్టేట్ మాత్రమే అని విమ‌ర్శించారు. అమరావతిలో  తన బినామీ భూములకు ధరలు పడిపోయాయని బాబు బాధ అంతా ఇంతా కాద‌న్నారు. 
 
 
చంద్రబాబు ప్రజా రాజధానిని కోరుకున్న వ్యక్తే అయితే.. అమరావతిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పేదవర్గాలకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సెంటున్నర చొప్పున ఇంటి స్థలాలు ఇస్తామంటే..  కోర్టులకు తన మనుషుల్ని పంపించి చంద్రబాబు ఎందుకు అడ్డుకున్నార‌ని ప్ర‌శ్నించారు. పేదలకు ఇళ్ళ స్థలాలు ఇస్తే, డెమోగ్రాఫిక్ ఇంబ్యాలెన్స్ వస్తుందని చెప్పింది వాస్తవమా కాదా? ఇంతకన్నా ఘోరం ఉంటుందా? అని ప్ర‌శ్నించారు. 
 
 
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పేదవర్గాలవారు ఉంటే తాను కలలుగన్న అమరావతి మురికికూపంగా మారిపోతుందని చంద్రబాబు మాట్లాడార‌ని, తమను వద్దు అనుకున్న చంద్రబాబు కూడా రాష్ట్రానికి అవసరం లేదని ఈ వర్గాలంతా ఏకమై ప్రతి ఎన్నికలోనూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా తీర్పు ఇస్తున్నార‌ని సురేష్ చెప్పారు. 
 
 
అమరావతిలో శాసన రాజధాని ఉంటుంద‌ని, దానితోపాటే మిగతా నగరాల మాదిరిగానే సహజంగా అమరావతి అభివృద్ధి అవుతుంద‌న్నారు. ఇదే సమయంలో విశాఖపట్నానికి కార్యనిర్వాహక రాజధాని వస్తుందంటే... మొత్తంగా ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందంటే.. దానిని బాబు ఎందుకు అడ్డుకున్నాడో ఆయనే చెప్పాల‌న్నారు. 
 
అలాగే, కర్నూలుకు హైకోర్టు వస్తూ ఉంటే ఎందుకు అడ్డుకున్నాడో కూడా ఆయనే చెప్పాల‌ని, అమరావతిలో శాసన రాజధాని ఉండటానికి వీల్లేదని ఎవరూ అనటం లేద‌న్నారు. రాయలసీమలో అభివృద్ధి ఉండకూడదని, ఉత్తరాంధ్రలో అభివృద్ధి ఉండకూడదని, అంతా తనకే, తన బినామీ భూముల రేట్ల కోసం కావాలని బాబు అడుగుతున్నార‌ని ఎద్దేవా చేశారు. దాని కోసమే తిరుపతి యాత్ర మొదలు పెట్టించార‌ని, ఇది మిగతా ప్రాంతాల ప్రజల్ని అవమానించడం, రెచ్చగొట్టడం కాదా అని ప్ర‌శ్నించారు.