సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : సోమవారం, 29 జులై 2019 (13:49 IST)

ప్రత్యేక హోదాపై మడమ తిప్పారా జగన్ గారూ... మా జాతి ఆశలపై నీళ్లు చల్లడం తగునా... ముద్రగడ

కాపు రిజర్వేషన్లపై రగడ మొదలైంది. కాపు నేత ముద్రగడ పద్మనాభం ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశిస్తూ ఓ బహిరంగా లేఖను విడుదల చేశారు. ఇపుడీ లేఖ చర్చనీయాంశంగా మారింది. చూడండి ఆ లేఖలో ఏమున్నదో.
 
''కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 10 శాతం ఇడబ్ల్యుఎస్ రిజర్వేషన్లో 5 శాతం మా జాతికి(బలిజ, తెలగ, వంటరి, కాపు) అమలు చేయడానికి కోర్టులో కేసులు వున్నందున ఇవ్వడానికి కుదరదని మీరు చెప్పినట్లు, దీనిపై జీవో కూడా ఇచ్చినట్లు పత్రికల్లో చూశాను. ఈ 5 శాతం ఏ గౌరవ కోర్టులో ఈ కేసులు మీద స్టే ఇచ్చారో అసెంబ్లీలోగానీ మీడియా ద్వారా గానీ తెలిపి వుంటే సంతోషపడేవాడిని.

దయచేసి కోర్టులో వున్న కేసులు వివరాలు బహిరంగపర్చండి. మీరన్నట్లు నిజంగా గౌరవ కోర్టు స్టే చేసి వుంటే మడమ తిప్పకుండా నా వెంట నడిచే మా జాతిని తిరిగి ఎన్నికలు వచ్చేవరకూ హక్కులు కానీ, కోరికలు కానీ అడగని విధంగా నోటికి ఫ్లాస్టర్లు వేసుకోమంటాను. దయచేసి ఆ వివరాలు బహిరంగపర్చండి. 
 
మా జాతి కేవలం మీరు ఇస్తామన్న 2000 కోట్లకి ఆశపడి ఓట్లు వేసినట్లుగా మీరు భావిస్తున్నారా? నిత్యం ఈ జాతి ఓట్లు వేయాలి, ఎటువంటి కోరికలు లేకుండా బానిసలుగా బతకాలని మీ అభిప్రాయమా?  25 మంది ఎంపీలను గెలిపిస్తే ప్రత్యేక హోదా తెచ్చి తీరుతానన్నారు.

కానీ లోక్ సభలో గౌరవ ఆర్థిక మంత్రిగారు, గౌరవ హోం మంత్రిగారు ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం లాంటిదని చెప్పడం జరిగింది. మడమ తిప్పని మీరు కనీసం హోదా గురించి పట్టించుకోకుండా బానిసలుగా బతుకుతున్న మా జాతి ఆశలపై నీళ్లు చల్లడం మీకు తగునా ముఖ్యమంత్రి గారూ...
 
చిన్న మనవి...
అయ్యా... ఆమధ్య తమ సోదరి షర్మిలగారు మీద బూతులు సోషల్ మీడియాలో ప్రచారం అయిన సందర్భంగా వారు బాధతో, ఆవేదనతో హైదరాబాదు పోలీసు స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చే పరిస్థితి వచ్చింది. అలాగే ఈ రోజు నన్ను కాపు ద్రోహి, స్వార్థపరుడు, గజదొంగ, అమ్ముడుపోయాడు, మునిగిపోయిన ముద్రగడ అని ఎన్నో బూతులు అన్ని పార్టీల వారు రాయిస్తున్నారు.

వాటికి బెదిరి పోవడానికి నేనేమీ ఎన్నారైని కాదండి. దయచేసి నేను కూడా మీ సోదరి షర్మిల గారి లాంటివాడినే అని గ్రహించమని కోరుతున్నాను'' అంటూ ముద్రగడ పద్మనాభం బహిరంగ లేఖ రాశారు.