గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 22 సెప్టెంబరు 2020 (13:41 IST)

సెల్ఫీ పేరుతో భార్యను నమ్మించి నదిలోకి తోసిన భర్త... తర్వాత ఏమైంది?

హైదరాబాద్ నగరానికి చెందిన ఓ హోంగార్డు దారుణంగా ప్రవర్తించాడు. కట్టుకున్న భార్యను చంపేందుకు ఓ ప్లాన్ వేశాడు. సెల్ఫీ తీసుకుందామని ఓ నది వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ సెల్ఫీ తీసుకున్నట్టుగా నటిస్తూ భార్యను నదిలోకి తోసేశాడు. ఆ తర్వాత భార్యను కాపాడేందుకు ప్రయత్నించినట్టుగా నటిస్తూ నదిలోకి దూకాడు. అయితే, అతనికి ఈత రావడంతో ఒడ్డుకు చేరాడు. కానీ తన భార్య మాత్రం చనిపోయిందని తీర్మానించుకుని ఇంటికి చేరుకున్నాడు. అయితే, నదిలో కొట్టుకుని పోతున్న మహిళను కొంతమంది రైతులు గమనించి రక్షించారు. ఆ తర్వాత ఆస్పత్రిలో చేర్చగా ఆమె ప్రాణాలతో బయటపడింది. దీనిపై భార్య ఇచ్చిన ఫిర్యాదుతో భర్తపై హత్యాయత్న కేసును నమోదు చేశారు. ఈ ఘటన కర్నూలు జిల్లాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నగరానికి చెందిన రామలక్ష్మి అనే అనాథ యువతి బ్యూటీ పార్లర్‌ నిర్వహిస్తున్నది. హైదరాబాద్‌లో హోంగార్డుగా పనిచేసే పత్తి భాస్కర్ తో కొన్నేళ్ల క్రితం ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత అది ప్రేమగా మారి 2016లో వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు. 
 
కొన్నాళ్ల పాటు భార్యను బాగానే చూసుకున్న భాస్కర్‌లో కొంతకాలంగా మార్పు వచ్చింది. ఆమెను వదిలించుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 16న కర్నూలు జిల్లాలోని తన స్వగ్రామం మర్రిపల్లెకు భార్య రామలక్ష్మితో కలిసి భాస్కర్ వెళ్లాడు. సోమవారం(సెప్టెంబర్ 20) ఉదయం బంధువుల ఇంటికి వెళ్దామని బైక్‌పై రామలక్ష్మిని ఎక్కించుకుని బయలుదేరాడు.
 
మార్గమధ్యలో కుందూ నది వంతెన వద్దకు చేరుకున్న తర్వాత అక్కడ బైక్ ఆపాడు. అక్కడ ఓ సెల్ఫీ తీసుకుందామని భార్యను నమ్మించి పక్కనే ఉన్న నదిలోకి తోసేశాడు. నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రామలక్ష్మి ప్రవాహంలో కొట్టుకుపోయింది. ఈ ఘటనను ప్రమాదంగా చిత్రీకరించేందుకు తాను కూడా బైక్‌తో సహా నదిలో దూకాడు. 
 
అయితే తనకు ఈత రావడంతో ఎలాగోలా ఒడ్డుకు చేరాడు. రామలక్ష్మి చనిపోయి ఉంటుందని ఇక అక్కడినుంచి ఇంటికి వెళ్లిపోయాడు. కానీ రామలక్ష్మి ప్రాణాలతో బయటపడటంతో అతను షాక్ తిన్నాడు. నదిలో కొట్టుకుపోతున్న రామలక్ష్మిని స్థానిక రైతులు కొందరు గమనించి రక్షించారు.
 
అనంతరం ఆమెను చికిత్స నిమిత్తం ఉయ్యాలవాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలుస్తున్నది. ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని బాధితురాలు రామలక్ష్మి నుంచి వివరాలు సేకరించారు. 
 
ఆమె ఫిర్యాదు మేరకు భాస్కర్‌పై హత్యాయత్నంతో పాటు పలు కేసులు నమోదు చేశారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని... బాధితురాలికి న్యాయం చేస్తామని వెల్లడించారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతున్నది.