సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 24 జులై 2024 (15:31 IST)

ఫోర్జరీ సంతకాలతో పంచాయతీ నిధులను వైకాపా నేతలు దోచుకున్నారు : పవన్‌కు ఫిర్యాదు

pawan kalyan
వైకాపా నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై నెల్లూరు జిల్లా ముత్తుకూరు మేజర్ పంచాయతీ సర్పంచ్ లక్ష్మి సంచలన ఆరోపణలు చేశారు. తన సంతకాలను ఫోర్జరీ చేసి పంచాయతీ నిధులను స్వాహా చేశారంటూ ఏపీ ఉప ముఖ్యమంత్రి, పంచాయతీ రాజ్ శాఖామంత్రి పవన్ కళ్యాణ్‌కు ఫిర్యాదు చేశారు. 
 
బుధవారం అసెంబ్లీలో టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో కలిసి అసెంబ్లీకి వచ్చిన లక్ష్మి... పవన్ కళ్యాణ్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా లక్ష్మికి జరిగిన అన్యాయాన్ని సోమిరెడ్డి వివరించారు. కాకాణితోపాటు పలువురు వైకాపా నేతలు తనపై దౌర్జన్యం చేశారని పవన్‌కు ఆమె ఫిర్యాదు చేశారు. బెదిరింపులకు పాల్పడి బలవంతంగా సంతకాలు చేయించుకున్నారన్నారు. ఆమె ఫిర్యాదుపై స్పందించిన మంత్రి పవన్ కళ్యాణ్.. లక్ష్మి చేసిన ఫిర్యాదులకు సంబంధించి పూర్తి వివరాలు తన ముందు ఉంచాలని ఆయన అధికారులను ఆదేశించారు. 
 
నెల్లూరు జిల్లా ముత్తుకూరు మేజర్ పంచాయతీ సర్పంచ్‌గా లక్ష్మి కొనసాగుతున్నారు. తాను గిరిజనురాలిని కావడంతో మూడేళ్లుగా వైకాపా నేతలు, పంచాయతీ కార్యదర్శి ఇష్టానురీతిలో వేధించారని, తన సంతకాన్ని ఫోర్జరీ చేసి కోట్లాది రూపాయల పంచాయతీ నిధులను దుర్వినియోగం చేశారని, పంచాయతీ సర్పంచ్ తాను అయినప్పటికీ.. పెత్తనం, పాలన అంతా వైకాపా నేతలే కొనసాగించారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు.