నా పోరాటం ఆగదు.. నారా లోకేశ్
జగన్ సర్కార్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అధికారంలోకి రాగానే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలకు.. ఒకేసారి నోటిఫికేషన్ విడుదల చేస్తామంటూ ఆశపెట్టి నిరుద్యోగ యువతను బలితీసుకుంటున్నారని విమర్శించారు.
జగన్ రెడ్డి రెండేళ్ల పాలనలో 300 మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నా.. వైసీపీ ప్రభుత్వంలో చలనం లేదన్నారు. కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం చనుగొండ్ల గ్రామానికి చెందిన నిరుద్యోగ యువకుడు గోపాల్ మృతిని ఈ సందర్భంగా ప్రస్తావించారు. గోపాల్ మృతి తనను తీవ్రంగా కలచివేసిందన్నారు.
స్తోమత లేకపోయినా రెక్కల కష్టంతో గోపాల్‌ను తల్లిదండ్రులు ఉన్నత చదువులు చదివించారని.. రెండేళ్ల పాటు జాబ్ క్యాలెండర్ కోసం ఎదురుచూసిన ఉద్యోగం లేదని మనస్తాపానికి గురై ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. ఇచ్చిన హామీ మేరకు జగన్‌రెడ్డి 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు.. వెంటనే భర్తీ చేసే వరకూ తన పోరాటం ఆగదని నారా లోకేశ్ అన్నారు.