ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 11 ఏప్రియల్ 2024 (08:56 IST)

అమరావతిని నాశనం చేయడమే కాదు.. చివరకు బూడిదను కూడా అమ్ముకుంటున్నారు : టీడీపీ నేత వసంత

vasantha krishna prasad
అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిని నాశనం చేయడమే కాకుండా, చివరకు బూడిదను కూడా మిగల్చకుండా  అమ్ముకుంటున్నారని మైలవరం టీడీపీ అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ ఆరోపించారు. ఆయన తెలుగు నాడు ట్రేడ్‌ యూనియన్‌ నాయకులతో సమావేశమయ్యారు. గొల్లపూడిలో జిగిన ఈ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ, రాజధానిగా అమరావతి ఉంటుందని అసెంబ్లీలో ప్రకటించి కార్యాలయం, ఇల్లు ఇక్కడే కట్టుకుంటున్నానని చెప్పిన జగన్‌ మాట తప్పారన్నారు. అవినీతికి కేరాఫ్‌ అడ్రస్‌గా వైకాపా మారిందని, అందుకే పార్టీని వీడినట్లు పేర్కొన్నారు. 
 
అసంఘటిత రంగ కార్మికుల పొట్టకొట్టారని, భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి కరవైందన్నారు. ఎన్టీపీఎస్‌ కార్మికుల ఉద్యోగాల క్రమబద్ధీకరణపై మాట తప్పి మడమ తిప్పారన్నారు. తాను మూడు సార్లు ముఖ్యమంత్రిని కలిసినా ఫలితం లేదన్నారు. ఒప్పంద కార్మికుల సమస్యలు సీఎంకు తెలియడం లేదన్నారు. రాష్ట్రానికి పరిశ్రమలు రాకపోవటం వలన యువతకు ఉద్యోగాలు లేవన్నారు. ఎన్టీపీఎస్‌ నుంచి వచ్చే బూడిదను అక్రమమార్గంలో విక్రయిస్తుంది ఎవరనే విషయమై సీబీఐ, ఈడీ చేత విచారణ చేయించాలన్నారు. 
 
తాడేపల్లిలోని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన సిఫార్సు మేరకు రాజమహేంద్రవరంలోని ఒక ప్రజాప్రతినిధి సన్నిహితులు, మంత్రి అనుచరులు బూడిదను అమ్ముకుంటున్నారన్నారు. కొత్తూరు తాడేపల్లిలోని మట్టిని గుంటూరు జిల్లాకు చెందిన ఓ ప్రజాప్రతినిధి తరలించాడన్నారు. వీటన్నింటిపై తన మీద అసత్య ఆరోపణలు చేశారన్నారు. నాసిరకం మద్యాన్ని ప్రజలకు విక్రయిస్తూ ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారన్నారు. ఇసుకను కిలోల లెక్కన అమ్ముతున్నారని, కృత్రిమ కొరత సృష్టించి ధరలను పెంచారని తెలిపారు. విద్యుత్తు సబ్‌స్టేషన్లలో ఆపరేటర్‌ పోస్టులను లక్షలాది రూపాయలకు అమ్ముకున్నారని ఆరోపించారు.