శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 30 ఏప్రియల్ 2023 (14:57 IST)

చంద్రబాబు - పవన్‌లు కలిసి పని చేస్తారు : నాదెండ్ల మనోహర్

nadendla manohar
మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌లు కలిసి పని చేస్తారని జనసేన పార్టీ సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ తెలిపారు. శనివారం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ దాదాపు గంటన్నరకు పైగా హైదరాబాద్ నగరంలోని బాబు నివాసంలో భేటీ అయ్యారు. ఈ భేటీ ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా, వైకాపా నాయకులకు నిద్రలేని రాత్రులను మిగుల్చుతుంది. 
 
ఈ నేపథ్యంలో ఈ భేటీపై నాదెండ్ల మనోహర్ స్పందిస్తూ, భవిష్యత్‌లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మధ్య మరిన్ని భేటీలు జరుగుతాయన్నారు. రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా వీరిద్దరూ భేటీ అవుతున్నారని చెప్పారు. మున్ముందు వారిద్దరూ కలిసి పని చేస్తారని తెలిపారు. వైకాపా విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం జనసేన పార్టీ కృషి చేస్తుందని చెప్పారు. 
 
ఏపీలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా వీరిద్దరి భేటీ ఎంతో ఆవశ్యమన్నారు. పవన్, చంద్రబాబుల మధ్య భవిష్యత్తులో మరిన్ని సమావేశాలు ఉంటాయని చెప్పారు. రాబోయే ఎన్నికలకు సన్నద్ధం అవుతున్నామని తెలిపారు. వైకాపా విముక్త ఏపీ కోసం జనసేన కృషి చేస్తుందని తెలిపారు. తమ పార్టీ నినాదం కూడా అదేనని చెప్పారు. సీఎం జగన్‌ పట్ల ప్రజల్లో నమ్మకం పోయిందన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు ఘోరంగా విఫలమయ్యాయని తెలిపారు. విశాఖలో భూదందాలపై జనసేన పోరాటం చేస్తుందని ఆయన స్పష్టం చేశారు.