శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Modified: బుధవారం, 11 జులై 2018 (11:58 IST)

కన్నా, జగన్, పవన్‌లకు ఆ దమ్ముందా? మంత్రి నక్కా సవాల్

అమరావతి : రాష్ట్ర ప్రభుత్వం, టీడీపీకి వ్యతిరేకంగా చేస్తున్న నాటకాలను కట్టిపెట్టాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకు, వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు జగన్‌కు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు హ

అమరావతి : రాష్ట్ర ప్రభుత్వం, టీడీపీకి వ్యతిరేకంగా చేస్తున్న నాటకాలను కట్టిపెట్టాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకు, వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు జగన్‌కు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు హెచ్చరించారు. రాబోయే ఎన్నికల్లో సీఎం చంద్రబాబునాయుడు నాయకత్వంలోని థర్డ్ ఫ్రంట్ అధికారం చేపట్టడం ఖాయమనే భయంతో బీజేపీ కుట్రలు చేస్తోందన్నారు. 
 
పాదయత్రల సందర్భంగా సీఎం చంద్రబాబునాయుడుపై వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు జగన్ అవాకులు చవాకులు పేలుతున్నారన్నారు. రాష్ట్రాభివృద్ధిలో అహర్నిశలూ కృషి చేస్తున్న ఉద్యోగులు, అధికారుల ఆత్మస్థైర్యం దెబ్బతినేలా జగన్ బెదిరిస్తున్నారన్నారు. అధికారంలోకి వస్తే అధికారులు, ఉద్యోగుల అంతుచూస్తామని హెచ్చరించడం దారుణమన్నారు. యథా రాజా తథా ప్రజా అన్నట్లు ఆయన పార్టీ నేతలు విజయసాయిరెడ్డి, చెవిరెడ్డి, కాకాని గోవర్దన్ రెడ్డి సైతం ఇదో ధోరణిలో వ్యవహరిస్తున్నారని మంత్రి నక్కా ఆనందబాబు మండిపడ్డారు. 
 
విశాఖపట్నం ఎయిర్ పోర్టులో పోలీసు కమిషనర్ పైన తాను కాబోయే సీఎం అంటూ జగన్ బెదిరింపులకు దిగారన్నారు. తిరుపతి ఎయిర్ పోర్టులో అక్కడి అధికారులపై చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దౌర్జన్యానికి దిగి జైలు పాలయ్యారన్నారు. అధికారులు పనిచేయాలా.. వద్దా అని వైఎస్ఆర్ సిపి నేతలను మంత్రి నక్కా ఆనందబాబు నిలదీశారు. వైఎస్ అధికారంలో ఉన్నప్పుడు జగన్ అవినీతి కారణంగా పలువురు అధికారులు, పారిశ్రామికవేత్తలు జైలు పాలయ్యారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కారణంగా మాట్లాడానికి ఏమీ లేకపోవడంతో, ఇసుక, మట్టి దోపిడి అంటూ జగన్ ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారన్నారు. భూగర్భ జలాల పెంపుదలకు చెరువుల్లో మట్టి తొలగింపు పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. 
 
చెరువుల్లో తీసుకున్న మట్టిని రైతులు, ఇళ్ల నిర్మాణాల్లో ప్రజలు వాడుకుంటున్నారన్నారు. ఇవేమీ తెలుసుకోకుండా వాళ్ల పార్టీ నేతలు చెప్పిన మాటలు విని, చిన్నా పెద్దా తేడా లేకుండా సీఎం చంద్రబాబుపై నోరు పారేసుకుంటున్నారని మంత్రి నక్కా ఆనందబాబు మండిపడ్డారు. జగన్‌కు దమ్ముంటే బీజేపీతో కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించాలని ఆయన సవాల్ విసిరారు. 2014 ఎన్నికలకు ముందుగానే తాము బీజేపీతో కలిసి జతకట్టామన్నారు. ఆ తరవాత కలిసి పోటీ చేశామన్నారు. సుప్రీం కోర్టు చెప్పినా, బీజేపీతో ఉన్న అవగాహన కారణంగా అయిదున్నర ఏళ్ల నుంచి జగన్ కేసులు ఒక్క అంగుళం కూడా కదలడం లేదన్నారు. జాతీయ పార్టీ అయిన బీజేపీకి సిగ్గుండాలని మంత్రి నక్కా ఆనందబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. 
 
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తన అవినీతిని కాపాడుకోడానికే కాషాయ పార్టీలో చేరారన్నారు. కన్నా లక్ష్మీనారాయణ వైసీపీలో చేరుతారంటూ కొందరు రాత్రికిరాత్రి ప్లేక్సీలు ఏర్పాటు చేశారన్నారు. మరుసుటి రోజు ఉదయం అదే వ్యక్తుల పేరుతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నాకు అభినందనలు అంటూ కొత్త ప్లెక్సీలు వెలిశాయన్నారు. గత ఎన్నికలకు ముందు కిరణ్ కుమార్ రెడ్డిని సీఎం పదవి నుంచి తొలగిస్తే, తనకు ఆ అవకాశమివ్వాలంటూ ఆనాడు ఢిల్లీలో కన్నా లక్ష్మీనారాయణ ప్రదక్షిణలు చేశారని మంత్రి నక్కా ఆనందబాబు దుయ్యబట్టారు. 
 
2014 ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలు పోటీకి ముఖం చాటేస్తే, కన్నా లక్ష్మీనారాయణ మాత్రం బరిలో దిగారన్నారు. రాజకీయాల్లో ఉన్నవారికి నైతిక విలువలు ఉండాలన్నారు. కన్నా లక్ష్మీనారాయణ యాత్ర సందర్బంగా ప్రతి చోటా గొడవలు జరుగుతున్నాయన్నారు. రాష్ట్రానికి ఇచ్చిన హమీలను మరిచిందనే కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర ప్రజలు ఆగ్రహంగా ఉన్నారన్నారు.  అవి వ్యక్తిగత నిరసనలు కావని, బీజేపీ తీరుపై ఆగ్రహానికి నిదర్శనమని అన్నారు. ఒకటికి పది సార్లు మాట్లాడితే, అబద్ధం నిజం అవుతుందని బీజేపీ నేతలు భ్రమ పడుతున్నారన్నారు. 
 
జగన్ ఉదయం మాట్లాడితే, అదే రోజు మధ్యాహ్నం అవే వ్యాఖ్యలను కన్నా లక్ష్మీనారాయణ నోటివెంట వస్తాయన్నారు. మరుసటి రోజు అవే మాటలను పవన్ కల్యాణ్ చెబుతారన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపైనా, టీడీపీపైనా వాళ్లు చేస్తున్న నాటకాలు కట్టబెట్టాలని, లేకుంటే సరైన సమయంలో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు రావడం వల్లే నరేంద్రమోడి హవాకు బ్రేక్ పడిందన్నారు. దేశంలో నరేంద్ర మోడికి తగిన బుద్ధి చెప్పిన పార్టీ టీడీపీయేనని మంత్రి నక్కా ఆనందబాబు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో సీఎం చంద్రబాబునాయుడు నాయకత్వంలోని థర్డ్ ఫ్రంట్ అధికారం చేపట్టడం ఖాయమనే భయంతో బీజేపీ కుట్రలు చేస్తోందన్నారు.