సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , శనివారం, 23 అక్టోబరు 2021 (16:48 IST)

కార్టూనిస్టులు వ్యక్తిత్వాన్ని చంపుకుని కార్టూన్లు గీయకూడదు

కార్టూనిస్టులు తమ వ్యక్తిత్వాన్ని చంపుకుని కార్టూన్లు గీయకూడద‌ని, అలా గీసిన కార్టూనిస్టులు కాలగర్భంలో కలిసిపోతారని అన్నారు ఆంధ్రప్రదేశ్ తెలుగు, సంస్కృత అకాడమీ చైర్మన్ శ్రీమతి డా.నందమూరి లక్ష్మీపార్వతి. కార్టూనిస్ట్ లెజండ్ ఆర్.కె.లక్ష్మణ్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా శనివారం ఉదయం 11 గంటలకు గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఆర్.కె.లక్ష్మణ్ గీసిన కార్టూన్ల ప్రదర్శనలో ఆమె పాల్గొన్నారు.
 
ఆర్కె ల‌క్ష్మ‌ణ్ జ్ఞాపకాల స్మరణ కార్యక్రమం హాస్యపు హరివిల్లు- మల్లెతీగ సంస్థల అధ్యర్యంలో జరిగింది. కార్టూన్ల ప్రదర్శనను సుప్రసిద్ధ కార్టూనిస్ట్ టి.వెంకట్రావు (టీవీ) ప్రారంభించారు. అనంతరం జరిగిన ఆర్.కె.లక్ష్మణ్ జ్ఞాపకాల స్మరణ కార్యక్రమానికి టీవీ సభాధ్యక్షత వహించారు. ముఖ్య అతిధిగా వచ్చిన  నందమూరి లక్ష్మీపార్వతి మాట్లాడుతూ, కార్టూనిస్టులు సమాజంలోని వాస్తవ పరిస్థితుల్ని చిత్రీకరించాలన్నారు. ఆర్.కె.లక్ష్మణ్ కామన్ మేన్ ని సృష్టించడం నిజంగా గొప్ప విషయమైతే, ఆ కామన్ మేన్ కి విగ్రహం ఏర్పాటు చేయడం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. కామన్ మేన్ గురించి ఆలోచించే వారెవ్వరైనా వారు విజయం సాధిస్తారన్నారు. 
 
సామాన్యుడ్ని ప్రేమించేవారెవ్వరైనా, ఏ రంగమైనా ప్రభంజనం సృష్టిస్తారన్నారు. అందుకు రాజకీయంలో నిన్న ఎన్టీఆర్, వైయస్సార్ నిదర్శనమైతే నేడు వైయస్ జగన్ ప్రత్యక్ష సాక్ష్యమన్నారు. కార్టూన్ రంగంలో ఆర్ కె.లక్ష్మణ్ ఉన్నత శిఖరాలు అధిరోహించారన్నారు అన్నారు. ఆయన శతజయంతి జరుపుకోవడం నిజంగా సంతోషదాయకమన్నారు. 
 
గౌరవ అతిధి ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ డా.మొండితోక అరుణ్ కుమార్ మాట్లాడుతూ- ఆర్ కె లక్ష్మణ్ గారి జ్ఞాపకాల స్మరణ కార్యక్రమానికి రావడమంటే చిన్నప్పడు చదువుకున్న ఆయన కార్టూన్లని గుర్తు చేసుకోవడమేనన్నారు. ఆయన అన్నగారు రాసిన మాల్గూడీ డేస్ పుస్తకాన్ని చదువుకున్న జ్ఞాపకాల్ని నెమరువేసుకోవడమేనన్నారు. కార్టూనిస్టులు కలుసుకోవడానికి, వారి కళని ఆవిష్కరించుకోవడానికి రాజధానిలో ప్రభుత్వం తరపున ఒక వేదిక కావాల్సిన అవసరం వుందన్నారు. అందుకు తన వంతు కృషి చేస్తానని అన్నారు. 
 
సభాధ్యక్షత వహించిన టీవీ మాట్లాడుతూ- సమాజంలో నెలకొన్న ఎగుడు దిగుడుల్ని సరి చేసేందుకు ఆర్ కె.లక్ష్మణ్ తన కార్టూన్ల ద్వారా కృషి చేశారన్నారు. ఆ దిశలోనే 'కామన్ మేన్'ని సృష్టించారన్నారు. ఆయన కామన్ మేన్ కి ప్రపంచ గుర్తింపు లభించిందన్నారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షులు సీనియర్ జర్నలిస్ట్ నిమ్మరాజు చలపతిరావు మాట్లాడుతూ- జర్నలిస్టులు రెండు పేజీల్లో చెప్పే విషయాన్ని కార్టూనిస్టులు చిన్న పాకెట్ కార్టూన్లో తెలియజేస్తారన్నారు. మేధావుల ఫోరం అధ్యక్షులు డా.ఘంటా విజయ్ కుమార్ మాట్లాడుతూ- జర్నలిస్టులకు మాదిరిగా కార్టూనిస్టులకు కూడా గుర్తింపు కార్డులివ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 
 
తొలుత కార్యక్రమ ఉద్దేశాన్ని మల్లెతీగ కలిమిశ్రీ తెలియజేసి, అతిధుల్ని వేదిక పైకి ఆహ్వానించారు. ఇదే వేదికపై మల్లెతీగ ఆధ్వర్యంలో నెల్లూరు ఆనందయ్య ఆయుర్వేద మందును ఉచితంగా పంపిణీ చేశారు. డా.నందమూరి లక్ష్మీపార్వతి, డా.మొండితోక అరుణ్ కుమార్ చేతుల మీదుగా ఆయుర్వేద మందును పలువురికి అందజేశారు. ఈ కార్యక్రమంలో చిత్రకారులు, కార్టూనిస్టులు మురళీధర్, పద్మ, రాజశేఖర్, ఎన్టీఆర్తో 15 ఏళ్ళ అనుబంధమున్న సీనియర్ జర్నలిస్టు బండారు రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని హాస్యపు హరివిల్లు కిరణ్, నవమల్లెతీగ చొప్పా రాఘవేంద్రశేఖర్ పర్యవేక్షించారు.