శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కె
Last Updated : శనివారం, 10 జులై 2021 (17:17 IST)

గాలి జనార్దన్ రెడ్డిని మించిపోతున్న బాక్సైట్ రెడ్డి!

బాక్సైట్ రెడ్డి తనకు దేవుడిచ్చిన అన్నయ్య గాలి జనార్దన్ రెడ్డిని మించిపోతున్నాడ‌ని టీడీపీ యువ‌నేత  నారా లోకేశ్ విమ‌ర్శించారు. విశాఖ మన్యం ఏరియాలో లేటరైట్ తవ్వకాల పరిశీలనకు వెళ్లిన టీడీపీ నేతల‌ను పోలీసులు ఎందుకు అడ్డుకున్నార‌ని లోకేష్ ప్ర‌శ్నించారు. విశాఖ మన్యం ప్రాంతంలో లేటరైట్ తవ్వకాల్లో అవ‌క‌త‌వ‌క‌లు జ‌రుగుతున్నాయ‌ని, వాటిని పరిశీలించేందుకు వెళ్లిన టీడీపీ నేతలను పోలీసులు నిర్బంధించారని లోకేశ్ వెల్లడించారు.

పోలీసుల నిర్బంధంలో ఉన్న టీడీపీ నేతలతో తాను ఫోన్లో మాట్లాడానని తెలిపారు. విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల సరిహద్దుల్లో ఉన్న అభయారణ్యంలో జగన్ బంధువులు లేటరైట్ ముసుగులో బాక్సెట్ తవ్వకాలు చేపడుతున్నారని ఆరోపించారు. ఇది 15 వేల కోట్ల బాక్సైట్ కుంభకోణం అని పేర్కొన్నారు.

బాక్సైట్ రెడ్డి తనకు దేవుడిచ్చిన అన్నయ్య గాలి జనార్దన్ రెడ్డిని మించిపోతున్నాడని, తన బంధువులైన వైవీ విక్రాంత్ రెడ్డి, వైఎస్ అనిల్ రెడ్డిలతో మైనింగ్ మాఫియా పనులు చేయిస్తున్నాడని తీవ్ర ఆరోపణలు చేశారు. వారి ఆగడాలకు అడ్డుకట్ట వేసేంత వరకు పోరాడాలని టీడీపీ నేతలకు సూచించానని లోకేశ్ వివరించారు.

అభయారణ్యాన్ని ధ్వంసం చేసి పర్యావరణానికి హాని కలిగిస్తూ, గిరిజనుల హక్కులపై ఉక్కుపాదం మోపుతూ చెలరేగిపోతున్న వైసీపీ మైనింగ్ మాఫియాను తరిమికొట్టేంత వరకు టీడీపీ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.