ఆదివారం, 3 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 29 అక్టోబరు 2024 (10:21 IST)

మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లతో మంత్రి నారా లోకేశ్ భేటీ..

satya nadella - lokesh
మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లతో ఏపీ ఐటీ శాఖామంత్రి నారా లోకేశ్ సమావేశమయ్యారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన రెడ్‌మండ్‌‍లోని సంస్థ సంస్థ ప్రధాన కార్యాలయంలో కలుసుకున్నారు. ఈ సందర్భంగా మైక్రోసాఫ్ట్‌లో పని చేసే తెలుగు టెక్కీలంతా కలిసి నారా లోకేశ్‌తో ఫోటోలు దిగారు. 
 
ఈ సందర్భంగా నారా లోకేశ్ మాట్లాడుతూ, విజనరీ లీడర్ చంద్రబాబు నేతృత్వంలో హైదరాబాద్ నగరం ఐటీ హబ్‌గా రూపుదిద్దుకుందని, ప్రస్తుతం నాలుగోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన బాబు ఏపీని టెక్నాలజీ రంగంలో అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారని తెలిపారు. ఇందులోభాగంగా రాష్ట్రవ్యాప్తంగా కొత్త ఐటీ హబ్‌లు, ఇన్నోవేషన్ పార్కులను నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. ఈ హబ్‌లను ప్రపంచ స్థాయి సాంకేతిక కేంద్రాలుగా తీర్చిదిద్దడంలో మైక్రోసాఫ్ట్ సహకారం అవసరం అని నారా లోకేశ్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. 
 
క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, డేటా సెంటర్ల ఏర్పాటుతో ఆంధ్రప్రదేశ్ ప్రపంచస్థాయి సంస్థలకు ప్రాంతీయ కేంద్రంగా మారే అవకాశాలు ఉన్నాయన్నారు. అటువంటి పెట్టుబడులకు అనుకూలమైన విధానాలు, భూమి తమ వద్ద అందుబాటులో ఉన్నాయని తెలిపారు. క్లౌడ్ సేవల్లో మైక్రోసాఫ్ట్ నాయకత్వంతో కలిసి మేము అత్యాధునిక సాంకేతిక పర్యావరణ వ్యవస్థను నిర్మించాలని భావిస్తున్నామని అందుకు సహకరించాల్సిందిగా సత్య నాదేళ్లతో మంత్రి లోకేశ్ విజ్ఞప్తి చేశారు. 
 
ముఖ్యంగా, ఏపీ అత్యుత్తమ ఐటీ, ఇంజనీరింగ్ ప్రతిభావంతులను తయారుచేసే బలమైన విద్యా వ్యవస్థను కలిగి ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్‌‍కు చెందిన పలువురు ఐటీ నిపుణులు ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా గణనీయమైన సేవలు అందిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఏపీలో ఐటీ, ఇంజనీరింగ్ టాలెంట్‌పై దృష్టి సారించాల్సిందిగా సత్య నాదేళ్లను కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వ్యవసాయం వెన్నెముకగా పేర్కొన్నారు. అందుకే అగ్రిటెక్‌కు ఏఐని అనుసంధానించడం వల్ల రాష్ట్ర వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు వస్తాయన్నారు.
 
దీనికోసం మైక్రోసాఫ్ట్ సాంకేతిక నైపుణ్యంతో ఉత్పాదకతను పెంచే వ్యవసాయ విధానాలను అభివృద్ధి చేయాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో భాగంగా స్ట్రీమ్ లైన్డ్ అప్రూవల్స్, ఫాస్ట్-ట్రాక్ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్, ప్రో-బిజినెస్ పాలసీలతో ఆంధ్రప్రదేశ్ వ్యాపార, వాణిజ్యరంగాలకు వేగవంతమైన సేవలను అందుబాటులోకి తెచ్చిందన్నారు. ఏపీలో సిద్ధంగా ఉన్న మౌలిక సదుపాయాలు, డిజిటల్ గవర్నెన్స్ వ్యూహాత్మక లాజిస్టిక్‍‌లకు అనువుగా ఉంటాయని తెలిపారు. దీనికి బలమైన పర్యావరణ వ్యవస్థ మద్దతుగా నిలుస్తుందని మంత్రి నారా లోకేశ్ తెలిపారు.