శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 1 ఆగస్టు 2018 (16:19 IST)

వ్యక్తిగత విమర్శలు చేస్తే పవన్‌కున్న బాధే అందరికీ: నారా లోకేష్

వైకాపా చీఫ్ జగన్.. జనసేనాని పవన్‌పై చేసిన విమర్శల గురించి తెలిసిందే. అలా వ్యక్తిగత విమర్శలు చేస్తే పవన్ ఎలా బాధ పడతారో తానూ అలాగే బాధపడుతున్నానని ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. జనసేన అధినేత పవన్‌ తనప

వైకాపా చీఫ్ జగన్.. జనసేనాని పవన్‌పై చేసిన విమర్శల గురించి తెలిసిందే. అలా వ్యక్తిగత విమర్శలు చేస్తే పవన్ ఎలా బాధ పడతారో తానూ అలాగే బాధపడుతున్నానని ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. జనసేన అధినేత పవన్‌ తనపై అదే పనిగా ఎందుకు విమర్శలు చేస్తున్నారో అర్థం కావట్లేదన్నారు. తాను అవినీతిపరుడినైతే.. ఇన్ని ఐటీ కంపెనీలు ఎలా వస్తాయని ప్రశ్నించారు. 
 
తనపై చేసిన ఆరోపణలు పవన్ ఎందుకు నిరూపించలేకపోతున్నారని నిలదీశారు. తనకు పరిచయం లేని శేఖర్‌రెడ్డితో సంబంధాలు అంటగట్టడం సరికాదని హితవు పలికారు. విజయవాడలో నారా లోకేష్ మీడియాతో మాట్లాడుతూ.. పవన్ అర్థంలేని ఆరోపణలు చేయడం వల్ల ప్రతిష్టాత్మక కంపెనీలు పెట్టుబడులకు వెనకాడుతున్నాయన్నారు.  పవన్‌కళ్యాణ్‌ కూడా కొన్ని కంపెనీలను రాష్ట్రానికి తెస్తే.. వారికీ ఇప్పుడు ఇస్తున్న విధానంలోనే ప్రోత్సాహకాలు ఇస్తామని చెప్పుకొచ్చారు. 
 
ఆధారాల్లేని ఆరోపణలు చేయడం వలన కంపెనీలు వెనక్కి వెళ్లిపోతాయనే విషయాన్ని పవన్ గుర్తించాలని చెప్పారు. ఇక కాపు రిజర్వేషన్ల గురించి ప్రతిపక్ష నేత జగన్‌ ఎప్పుడెప్పుడు ఏమేం చెప్పారో అందరికీ తెలుసని నారా లోకేష్ సెటైర్లు విసిరారు. కేంద్రం బుల్లెట్ రైలు కోసం భూమిని సేకరించలేకపోతోందన్న లోకేశ్‌.. రాజధాని కోసం 33 వేల ఎకరాల భూమిని రైతులు ఉదారంగా ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు.

పవన్ కల్యాణ్ అంటే తనకెంతో గౌరవమని.. తప్పులు సరిదిద్దుకోమంటే సరిదిద్దుకుంటాను కానీ.. దోచేస్తున్నానంటూ కామెంట్స్ చేయడం ఎంతవరకు సబబు అంటూ ప్రశ్నించారు. వ్యక్తిగత విమర్శలతో ఆయనకెంత బాధో తనకు అంతేనని నారా లోకేష్ వ్యాఖ్యానించారు.