శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Modified: మంగళవారం, 31 జులై 2018 (18:17 IST)

అమ్మాయి కనిపిస్తే ముద్దు పెట్టు, కడుపు చెయ్ అన్నోళ్ళను చూపించరా... రోజా ఫైర్

వైసిపి ఎమ్మెల్యే రోజా సహనం కోల్పోతున్నారా... ఇంతకాలం టిడిపిని టార్గెట్ చేసిన రోజా ఇప్పుడు మీడియాను టార్గెట్ చేశారా. పవన్ కళ్యాణ్‌ పైన వ్యక్తిగత ఆరోపణలు, కాపు రిజర్వేషన్ అంశాలపై తిరుపతిలో మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు రోజా ఒక్కసారిగా విరుచుకుపడ్

వైసిపి ఎమ్మెల్యే రోజా సహనం కోల్పోతున్నారా... ఇంతకాలం టిడిపిని టార్గెట్ చేసిన రోజా ఇప్పుడు మీడియాను టార్గెట్ చేశారా. పవన్ కళ్యాణ్‌ పైన వ్యక్తిగత ఆరోపణలు, కాపు రిజర్వేషన్ అంశాలపై తిరుపతిలో మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు రోజా ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. మీడియా ప్రతినిధులపై రోజా ప్రవర్తించిన తీరు వివాదాస్పదంగా మారుతోంది. ఇంతకీ తిరుపతిలో మీడియాపై ఎందుకు రోజా ఫైరయ్యారు. 
 
వైసిపి ఫైర్ బ్రాండ్ రోజా అనూహ్యంగా మీడియాను టార్గెట్ చేశారు. ఇంతకాలం తన మాటల దాడితో ప్రత్యర్థి పార్టీలను ఏకిపారేసే రోజా ఒక్కసారిగా రూటు మార్చి మీడియాపై విరుచుకుపడ్డారు. పవన్ పైన జగన్ చేసిన వ్యాఖ్యలను మీడియా వక్రీకరిస్తోందని మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసిపి పైన మెజారిటీ మీడియా సంస్థలు పక్షపాత ధోరణితో ఉన్నాయని ఆరోపించారు. పవన్ కళ్యాణ్‌ పైన జగన్ చేసిన వ్యాఖ్యలే మీడియాకు కనబడుతున్నాయని, అయితే గతంలో ముఖ్యమంత్రి బావమరిది ఎమ్మెల్యే బాలక్రిష్ణ మహిళలపై అసభ్య పదజాలం వాడినా, పలువురు టిడిపి నాయకులు మహిళలపై దాడులకు దిగినా ఎందుకు పట్టించుకోలేదని మీడియా ప్రతినిధులను ప్రశ్నించారు రోజా.
 
ఎమ్మెల్యే బాలక్రిష్ణ తన స్థాయిని మరిచి మహిళలు కనిపిస్తే కన్ను కొట్టాలి, కడుపు చేయాలని అని వ్యాఖ్యలు చేస్తే అది మీడియాకు వినసొంపుగా ఉన్నాయంటూ ఫైరయ్యారు. ఈ అంశంపై కనీసం బాలక్రిష్ణను వివరణ అడిగే సాహసం కూడా మీడియా ప్రతినిధులు చేయలేకపోయారని విమర్శించారు. గతంలో టిడిపి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మహిళా ఎమ్మార్వోపై దాడి చేసినా ఇంతవరకూ కేసు నమోదు చేయలేదన్నారు. ఆ ధైర్యంతోనే చింతమనేని మళ్ళీ అంగన్‌వాడీ వర్కర్లను సభ్యసమాజం తలదించుకునేలా మహిళలు చెప్పుకోలేని పదజాలం వాడారన్నారు. అంగన్‌వాడీ వర్కర్లు ఇళ్ళ స్థలాల కోసం చింతమనేని దగ్గరకు వెళితే ఆ పని చేసుకుంటే ఇళ్ళ స్థలాలు ఇప్పిస్తామంటూ ద్వందార్థం వచ్చేలా మహిళల పట్ల వ్యవహరించడం కరెక్టేనా అని ప్రశ్నించారు. 
 
స్పీకర్ కోడెల శివప్రసాద్ కుటుంబ సభ్యులు కోడలిని వేధింపులకు గురిచేసినా మీడియా ఎందుకు ప్రశ్నించలేదన్నారు. అలాగే మహిళల సమస్యల తరపున మాట్లాడుతున్న తనపైన బోడే ప్రసాద్ లాంటి టిడిపి నాయకులు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నా మహిళ అని చూడకుండా తనపైన నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పవన్ పెళ్ళిళ్ళ గురించి జరిగిన విషయాన్ని జగన్ మాట్లాడితే మీడియా పెద్ద సీన్ క్రియేట్ చేసిందని, కానీ టిడిపి నాయకులు మహిళలపైన ఎంత అసభ్యంగా మాట్లాడినా ఎందుకు ప్రశ్నించడం లేదని మండిపడ్డారు. 
 
ఇప్పటికైనా మీడియా తన తీరు మార్చుకోవాలని హితవు పలికారు. అయితే ఒక్కసారిగా ప్రెస్ మీట్‌లో రోజా మీడియాపై ఎదురుదాడికి దిగడంతో అక్కడ ఉన్న మీడియా ప్రతినిధులు అవాక్కయ్యారు. ప్రెస్ మీట్లో జరిగిన విషయాలను ప్రశ్నిస్తే మీడియాపై ఎదురుదాడికి దిగడం సరికాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి ఇప్పటికైనా రోజా తన తీరు మార్చుకుంటారో లేక మరిన్ని వివాదాస్పద అంశాలతో వార్తల్లో నిలవాలని భావిస్తారో చూడాల్సి ఉంది.