మంగళవారం, 24 జూన్ 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 10 జూన్ 2025 (16:32 IST)

అమరావతి మహిళలంతా వేశ్యలా? మూడు రోజుల్లో వివరణ ఇవ్వండి - ఎన్.సి.డబ్ల్యూ సమన్లు

amaravathi
వైకాపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఆయన సతీమణి వైఎస్ భారతీ రెడ్డిలకు చెందిన సాక్షి టీవీ చానెల్ చర్చా వేదికలో పాల్గొన్న సీనియర్ పాత్రికేయులు కొమ్మినేని శ్రీనివాస రావు, కృష్ణంరాజులు చేసిన వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో వివరిస్తూ మూడు రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. 
 
రాజధాని అమరావతి కోసం చేసిన ఉద్యమంలో మహిళా రైతులది అత్యంత కీలక పాత్ర అని జాతీయ మహిళా కమిషన్ అభిప్రాయపడింది. అలాగే, ఈ వ్యాఖ్యలపై మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా సుమోటాగా కేసు నమోదు చేసి, డీజీపీకి లేఖ రాసింది. ఈ మేరకు ఎన్.సి.డబ్ల్యూ చైర్ పర్సన్ విజయ్ రహత్కర్ రాష్ట్ర డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాలకు ఓ లేఖ రాశారు. 
 
అమరావతి ప్రాంతంలో ఉద్యమిస్తున్న మహిళలపై జర్నలిస్టులు కృష్ణంరాజులు, కొమ్మినేని శ్రీనివాస రావులు అనుచితంగా మాట్లాడారంటూ వచ్చిన ఆరోపణలను కమిషన్ తీవ్రంగా ఖండించింది. ఇటువంటి వ్యాఖ్యలు మహిళల గౌరవానికి భంగం కలిగించేలా ఉన్నాయని కమిషన్ అభిప్రాయపడింది. అమరావతి ఉద్యమంలో మహిళా రైతులు ముందుండి కీలక పాత్ర పోషించారని ఈ సందర్భంగా కమిషన్ గుర్తు చేసింది. 
 
ఈ వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించి వివిధ మీడియాల్లో వచ్చిన కథనాలను ఆధారంగా చేసుకుని ఎన్.సి.డబ్ల్యూ ఈ అంశాన్ని సుమోటాగా విచారణకు స్వీకరించినట్టు సమాచారం. జర్నలిస్టు కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యల విషయంలో ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియజేస్తూ మూడు రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని డీజీపీ హరీశ్ గుప్తాను మహిళా కమిషన్ ఆదేశించింది.