ఆదివారం, 24 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 22 ఫిబ్రవరి 2020 (16:02 IST)

రాజధాని తరలింపులో ట్విస్ట్... మిలీనియం టవర్‌కు అభ్యంతరం తెలిపిన నేవీ

విశాఖకు పరిపాలనా రాజధాని తరలింపు మరింత ఆలస్యం కానుందా అంటే అవుననే సమాధానమొస్తోంది. మిలీనియం టవర్స్‌లో పరిపాలనా విభాగాలను ఏర్పాటు చేయాలనుకున్న ప్రభుత్వానికి నేవీ నుంచి తీవ్ర అభ్యంతరాలు ఎదురయ్యాయి. దీంతో ఆ నిర్ణయాన్ని జగన్ సర్కార్ వెనక్కు తీసుకున్నట్టు తెలుస్తోంది. మిలీనియం టవర్స్‌లో సెక్రటేరియట్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఏపీ సర్కార్‌కు నేవీ లేఖ రాసింది. 
 
దేశ భద్రతకు అత్యంత కీలకమైన ఐఎన్ఎస్ కళింగకు సమీపంలో మిలీనియం టవర్స్ ఉన్నాయని లేఖలో పేర్కొంది. విశాఖను ప్రభుత్వం పరిపాలనా రాజధానిగా ప్రకటించడం.. మిలీనియం టవర్స్‌లో విభాగాలు ఏర్పాటు చేయడానికి సిద్ధం కావడంతో నేవీ తీవ్ర అభ్యంతరాలు లేవదీసింది. రక్షణకు అత్యంత కీలకమైన ఐఎన్ఎస్ కళింగకు సమీపంలో జనావాసాలను ఎలా అభివృద్ధి పరుస్తారని ప్రశ్నించింది. 
 
శత్రుదేశాలకు విశాఖపట్నం ప్రధాన లక్ష్యమని..
 ఇక్కడ ఎన్నో పరిశ్రమలు, కేంద్ర సంస్థలు ఉన్నాయని తెలిపింది. కాబట్టి.. దేశభద్రత దృష్ట్యా ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసుకోకపోవడమే మేలని నేవీ అధికారులు తెలుపుతున్నారు. ఒకసారి రాజధాని ఏర్పాటైతే.. ఆ ప్రాంతమంతా జనావాసాలతో కిటకిటలాడుతుందని.. దీంతో చాలా సమస్యలు ఎదురవుతాయని ఆందోళన వ్యక్తం చేసింది. 
 
ఐఎన్ఎస్ కళింగ వ్యూహాత్మక ప్రాంతమని.. ఇక్కడ రాజధాని ఏర్పాటుపై సాంకేతిక, భౌగోళిక అంశాలను సమీక్షించాల్సిన అవసరం ఉందని లేఖలో తెలిపింది. కాగా.. ఐఎన్ఎస్ కళింగ సుమారు 734 ఎకరాల మేర విస్తరించి ఉంది. తూర్పు నావికా దళానికి ఈ ప్రాంతం అత్యంత కీలకమైనది. దీనిపై నేవీ మరింత దృష్టి కేంద్రీకరిస్తోంది. మరిన్ని భూములను సేకరించేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే 400 ఎకరాల భూమిపై నేవీ, రెవెన్యూ శాఖల మధ్య వివాదం నడుస్తోంది. ఈ భూమిని 1980లలో అధికారుల ఇళ్ల కోసం జిల్లా పరిపాలనా విభాగం కేటాయించింది.