శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 17 డిశెంబరు 2020 (06:41 IST)

ప్రజారాజధాని అమరావతి కోసం "నేడు జనరణ భేరీ"

అమరావతి ఉద్యమం ప్రారంభమై సంవత్సరం పూర్తయిన సందర్భంగా "నేడు" రాజధాని ప్రాంతం రాయపూడి స్పీడ్ యాక్సెస్ రోడ్డు వద్ద ప్రజారాజధాని అమరావతి ఉండాలని కోరుతూ 'జన రణభేరి' పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు అమరావతి పరిరక్షణ సమితి జెఎసి కన్వీనర్లు ఎ.శివారెడ్డి, గద్దె తిరుపతిరావు తెలిపారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజారాజధానిగా అమరావతి ఉండాలని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారని అన్నారు. సంవత్సర కాలంగా అనేక విధాలుగా ఆందోళనలు చేసినట్లు తెలిపారు. ఉద్యమం ప్రారంభమై సంవత్సరం అవుతున్న సందర్భంగా గత వారం రోజులుగా ఆందోళనా కార్యక్రమాలను నిర్వహించామని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల వద్ద నుండి అనూహ్య స్పందన లభించిందన్నారు.

గుంటూరు, విజయవాడ నగరాలలో నిర్వహించిన మహా పాదయాత్రలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని విజయవంతం చేశారన్నారు. ఈసందర్భంగా పాదయాత్రలో పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ క్రమంలోనే ఉద్యమానికి ప్రచారాన్ని కల్పించి జాతీయస్థాయికి తీసుకువెళ్లిన మీడియాకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

నేడు జరిగే భారీ బహిరంగ సభలో కూడా ప్రజలతో పాటు వర్తక, వాణిజ్య, రైతు సంఘాలతో పాటు ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాన్ని తిప్పికొట్టే విధంగా అమరావతి ప్రజారాజధాని వాణి వినిపించాలని కోరారు.

బహిరంగ సభలో ఎవరికీ ఇబ్బంది కలుగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి అతిధులుగా అన్ని రాజకీయ పక్షాలు, వివిధ సంఘాల నుండి పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారని తెలిపారు. సమావేశంలో జెఏసీ సభ్యులు రాంబాబు, డాక్టర్ రాయపాటి శైలజ తదితరులు పాల్గొన్నారు.
 
హజరవుతున్న నాయకులు..
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తులసిరెడ్డి, శైలజానాథ్, జనసేన రాష్ట్ర నాయకులు నాదెండ్ల మనోహన్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణలతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ, ఎంఐఎం, లోకత్తా నుండి పార్టీ ప్రతినిధులు హజరుకానున్నారు.