1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 15 డిశెంబరు 2020 (21:18 IST)

ప్రజా రాజధానికోసం 'ప్రజాపోరు'

ప్రజారాజధానిగా అమరావతి కావాలని కోరుతూ అమరావతి పరిరక్షణ సమితి జేఎసీ, రైతు ఐకాస ఆధ్వర్యంలో మంగళవారం విజయవాడలో నిర్వహించిన 'అమరావతి రాజధాని పరిరక్షణ ప్రజా పాదయాత్ర'లో ప్రజలు కథంతొక్కారు.

ర్యాలీలో రాజధాని రైతులు, మహిళలు, యువత, విద్యార్థినులు, అమరావతి పరిరక్షణ మహిళా జెఏసీ నేతలు, తెదేపా, కాంగ్రెస్, జనసేన, సిపిఐ, ఆమాద్మీ, బహుజన సమాజవాది ఇరత సంఘాల నాయకులు, 60 సంవత్సరాలు పైబడిన వారు కూడా పాల్గొని “జై అమరావతి - సేవ్ అమరావతి", "ప్రజా రాజధాని అమరావతి కావాలి", "చావో..రేవో... అమరావతి చలో" అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ ముందుకు సాగారు.

ర్యాలీ ప్రారంభం కావడానికి 2 గంటల నుండే రైతులు, స్థానికులు, పెద్ద సంఖ్యలో మహిళలు పడవల రేవు సెంటర్ వద్దకు చేరుకున్నారు. అమరావతి కోసం ఉద్యమం తొలి రోజున ఏవిధమైన ఉద్యమ స్ఫూర్తి ఉందో ఆక్రమంలోనే మంగళవారం నిర్వహించిన ర్యాలీలో కూడా మహిళలు, వృద్ధులు, యువత ఉత్సాహంగా పెద్ద సంఖ్యలో పాల్గొని జై అమరావతి.. జై..జై.. అమరావతి అంటూ నినదించారు. ఎవరికి వారు నినాదాలు చేస్తూ ప్రభుత్వం మూడు రాజధానులు ప్రకటించడంపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.
 
అమరావతి పరిరక్షణ సమితి జెఎసి కన్వీనర్లు ఏ. శివారెడ్డి, గద్దె తిరుపతిరావు మాట్లాడుతూ రాజధాని ఉద్యమం సంవత్సరం పూర్తియిన సందర్భంగా అమరావతి పరిరక్షణ సమితి జెఎసి ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించిన ప్రజాపాదయాత్రకు అనూహ్య స్పందన లభించిందన్నారు. ఈ ఉద్యమ స్ఫూర్తి భవిష్యత్తులో మరింత స్థాయిలో ఉద్యమాన్ని మందుకువెలతామన్నారు.

ఇప్పటికైనా ముఖ్యమంత్రి శాశ్వత రాజధానిగా అమరావతి ఉంటుందని ప్రకటించాలని, ప్రకటించే వరకు ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు. గుంటూరు, విజయవాడలో నిర్వహించిన పాదయాత్రలో పెద్ద సంఖ్యలో రాష్ట్రం నలు మూలల నుండి ప్రజలు పాల్గొన్నారన్నారు. అలాగే ఈనెల 17వ తేదీన రాజధానికి శంకుస్థాపన చేసిన ప్రాంతంలో భారీ బహిరంగ సభ జరుగుతుదని పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
 
మాజీ శాసన సభ్యులు వంగవీటి రాధాకృష్ణ మాట్లాడుతూ ఆంధ్రరాష్ట్రం సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో అందరికీ ఆమోదయోగ్యమైన ప్రాంతం అమరావతిని రాజధానిగా ప్రకటించారన్నారు. అయితే రాజధాని అభివృద్ధితో పాటు పలు కంపెనీలు కూడా ఇక్కడకు వచ్చాయన్నారు. అధికారంలోకి వచ్చిన జగన్మోహనరెడ్డి మాత్రం మూడు రాజధానులు ప్రకటించి రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకున్నారన్నారు.

రాజధాని అమరావతి కోసం గత సంవత్సర కాలంగా పెద్ద స్థాయిలో ఉద్యమం జరిగిందన్నారు. ఇక నుండి ఉద్యమ స్వరూపం మారనున్నదని జెఏసీ చేసే ప్రతి కార్యక్రమానికి తమ మద్దతు ఉంటుందన్నారు. మూర్ఖత్వపు ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి తన వైఖరిని మార్చుకుని రాజధానిగా అమరావతి ఉంటుందని ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.
 
అమరావతి రైతు ఐకాసా కన్వీనర్ పువ్వాడ సుధాకర్ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా రాజధానికోసం 34వేల మంది రైతులు ముందుకు వచ్చి భూములు ఇచ్చారన్నారు. కాని ప్రస్తుత ముఖ్యమంత్రి రాజధాని అభివృద్ధి చేయకపోగా మూడు రాజధానులు అని ప్రకటించారన్నారు.

దీనితో రైతు ఐకాస ఆధ్వర్యంలో రాజధానిగా అమరావతి ఉండాలని కోరుతూ సంవత్సరకాలంగా పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతుందన్నారు. ఇక నుండి ఉద్యమాన్ని మరింత స్థాయిలో నిర్వహిస్తామని తెలిపారు. ఇప్పటికే రైతులు తమ నిరసనను వ్యక్తంచేస్తున్నారని ప్రభుత్వ ధోరణి ఇలాగే కొనసాగితే పెద్ద ఎత్తున ఉద్యమం నిర్వహిస్తామని హెచ్చరించారు.
 
మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ప్రజారాజధానిగా అమరావతి ప్రకటించే వరకు ఉ ద్యమం పెద్ద ఎత్తున కొనసాగుతుందన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి అహంకారంతో మూడు రాజధానుల విషయాన్ని అసెంబ్లీలో ప్రకటించారని నాటి నుండి సంవత్సర కాలం పాటు ఉద్యమం పెద్ద ఎత్తున జరుగుతూనే ఉందన్నారు.

ఉద్యమం రోజు రోజుకూ పెరుగుతూనే ఉందని, అమరావతి రాజధాని 29 గ్రామాల సమస్య కాదని, 3కోట్ల ఆంధ్రుల సమస్య అన్నారు. సిఎం ఇప్పటికైనా ప్రజల ఆవేధనను గుర్తించి ప్రజాగ్రహాన్ని చవి చూడకముందే అమరావతి ప్రజారాజధానిగా ఉంటుందని స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.
 
తూర్పు ఎమ్మెల్యే గద్దె రామమోహన్ మాట్లాడుతూ అమరావతి కోసం జరుగుతున్న ఉద్యమం చరిత్రలో ఎక్కడా జరగలేదన్నారు. రాజధాని కోసం 34వేల మంది రైతులు భూములు ఇచ్చి త్యాగం చేశారని కాని ప్రస్తుతం ముఖ్యమంత్రి రైతుల త్యాగాలను గుర్తించకుండా మూడు రాజధానులు ఉంటాయని ప్రకటించడం సరైనది కాదన్నారు. రాజధాని కోసం ఉద్యమం పెద్ద ఎత్తున జరుగుతుందని రాబోయే రోజుల్లో రాజధాని ఉద్యమం జాతీయస్థాయి ఉద్యమంగ మారనున్నదన్నారు.
 
మాజీ శాసన సభ్యులు బోడే ప్రసాద్ మాట్లాడుతూ అమరావతి ఉద్యమంలో మహిళలతో పాటు రైతులు, స్థానిక ప్రజలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది పాల్గొన్నారన్నారు. రానున్న కాలంలో ఉద్యమం ఇంకా పెద్ద ఎత్తున జరుగుతుందని ప్రతి ఒక్కరూ ఉద్యమంలో పాల్గొని రాజధాని కోసం పోరాడాలన్నారు.
 
కాంగ్రెస్ నాయకురాలు సుంకర పద్మశ్రీ మాట్లాడుతూ అమరావతి ఉద్యమాన్ని చూసి ముఖ్యమంత్రి ఆలోచనలో పడ్డారని అన్నారు. ఉద్యమాన్ని అణచివేసేందుకు అనేక కుట్రలు పన్నారని, మహిళలు అని కూడా చూడకుండా ఎన్నో ఇబ్బందులకు గురిచేశారని అయినా భయపడకుండా ఉద్యమాన్ని ముందుకు నడిపించామని ఇక ముందు కూడా మహిళలే ముందుండి రాజధాని కోసం పోరాడతారని అన్నారు. 
 
మహిళా సమాఖ్య రాష్ట్ర నాయకురాలు పి.దుర్గాభవానీ, అక్కినేని మాట్లాడుతూ రాజధాని ఉద్యమంలో మహిళలే అగ్రస్థానంలో ఉండి నడిచారన్నారు. అమరావతి ఉద్యమం కొంత మందిది కాదని రాష్ట్ర ప్రజానీకానిదన్నారు. అందుకే విజయవాడలో నిర్వహించిన మహా పాదయాత్రలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారన్నారు.

ఇక నుండి ఎటువంటి ఉద్యమం జరిగినా ప్రజలు అగ్రభాగాన ఉండి నడిపిస్తారని ఇప్పటికైనా ముఖ్యమంత్రి తెలుసుకోవాలన్నారు. భవిష్యత్తులో ఎటువంటి ఉద్యమానికి అయినా మహిళలతో పాటు అందరూ ముందుండి నడిపిస్తామని స్పష్టం చేశారు.
 
జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ గద్దె అనూరాద మాట్లాడుతూ అమరావతి ఉద్యమంలో మహిళలదే అగ్రస్థానమన్నారు. అమరావతే మన రాజధానిగా ప్రకటించాలనే ఉద్దేశంతో మహిళలు ఎటువంటి ఉద్యమానికి అయినా సిద్ధపడటం సంతోషంగా ఉందన్నారు. ముఖ్యంగా మహిళలపై అనేక విధాలుగా దాడులు జరిగినా రాజధానికోసం ముందుండి పోరాడారని కొనియాడారు.
 
కార్యక్రమంలో మాజీ శాసన సభ్యురాలు తంగిరాల సౌమ్య, జనసేన నాయకులు పోతిన మహేష్, దళిత బహుజన నాయకులు మేళం భాగ్యారావు, తేదేపా కార్పొరేటర్ అభ్యర్థిని కేశినేని శ్వేత, గన్నే వెంకటనారాయణ (అన్న), నరహరశెట్టి శ్రీహరి, తేదేపా విజయవాడ పార్లమెంట్ అధ్యక్షులు నెట్టెం రఘురామ్, దేవినేని చందు, యూవత్ ఫర్ ఆంద్రప్రదేశ్ నుండి పెద్ద సంఖ్యలో యువత పాల్గొన్నారు. అమరావతి పరిరక్షణ సమితి జెఎసి నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.