1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎంజీ
Last Updated : ఆదివారం, 14 నవంబరు 2021 (20:06 IST)

ఉద్యమాల ద్వారా ప్రజలకు చేరువ కావాలి: సీపీఐ గుంటూరు జిల్లా కార్యదర్శి

గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో లో ఆదివారం సాయంత్రం సిపిఐ శాఖ సమావేశం పెదవడ్లపూడిలో సీపీఐ నేత జవ్వాది వీరయ్య అధ్యక్షతన జరిగింది, ఈ శాఖ సమావేశానికి ముఖ్య అతిథులుగా సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా అజయ్ కుమార్ మాట్లాడుతూ స్థానిక సమస్యలను గుర్తించి సంబంధిత అధికారులకు వినతి పత్రాలు సమర్పించాలని అన్నారు, పార్టీ అభివృద్ధి కోసం సమిష్టిగా ప్రతి ఒక్కరూ కృషి చేయవలసిన అవసరం ఉందని అన్నారు.

ఎప్పటికప్పుడు గ్రామంలోని సమస్యలను తెలుసుకొని ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రోజు రోజుకి పెట్రోల్, డీజిల్, గ్యాస్, పెంచుకుంటూ పోతున్నాయని  తద్వారా నిత్యావసర సరుకులు ధరలు పెరిగి సామాన్య ప్రజలకు భారంగా మారిందని అన్నారు.

కేంద్ర బిజెపి ప్రభుత్వం తక్షణమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు, విభజన చట్టంలోని హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు, రాష్ట్రంలో రోడ్లు గుంతల మయంగా మారాయని  ఎక్కడైతే రోడ్లు పరిస్థితి అస్తవ్యస్తంగా ఉన్నాయో తక్షణమే ఆ ప్రాంతాల్లో రోడ్లను వేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

విశాఖ ఉక్కు చౌకగా ప్రైవేటు పరం చేయడాన్ని దుర్మార్గపు చర్యగా అభివర్ణించారు,క్షేత్రస్థాయిలో పార్టీ శాఖలు క్రియాశీలకంగా పని చేయాలని సీపీఐ పార్టీ పట్ల ప్రజల్లో విశ్వాసం కల్పించాలని ఉద్యమాల ద్వారా ప్రజలకు చేరువ కావాలని పిలుపునిచ్చారు.
 
ఈ కార్యక్రమంలో సీపీఐ మంగళగిరి నియోజకవర్గ కార్యదర్శి చిన్ని తిరుపతియ్య, వ్యవసాయ కార్మిక సంఘము జిల్లా ప్రధాన కార్యదర్శి కాబోతు ఈశ్వరరావు, బసవ పున్నయ్య, శివమ్మ,గౌస్, బాజీ, జాన్ సైదా, కృష్ణ, రాజారావు, బాజీ, శివ కుమారి. తదితరులు పాల్గొన్నారు.