ఆంధ్రా వాళ్లు పైసలు లేక బిచ్చమెత్తుకుంటున్నారు: తెలంగాణ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
తెలంగాణ, ఏపీ మంత్రుల మధ్య మరోసారి మాటల తూటాలు పేలాయి. ఇటీవల నదీ జలాల విషయంలో ఇరు రాష్ట్రాల మంత్రుల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ఆ తర్వాత వివాదం కాస్త సద్దుమణిగినప్పటికీ ఇవాళ నిజామాబాద్‌లో నిర్వహించిన రైతు ధర్నాలో తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి చేసిన ఘాటు వ్యాఖ్యలతో మరోసారి దుమారం రేగింది. ప్రశాంత్‌రెడ్డి వ్యాఖ్యలకు మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు.
జగన్ బిచ్చమెత్తుకుంటున్నారు: ప్రశాంత్‌రెడ్డి
తెలంగాణ వస్తే అడుక్కుతింటారని మనల్ని అన్నారు. కేసీఆర్ దయతో మన ఆదాయం మనమే అనుభవిస్తున్నాం. ఇప్పుడు మన పైసలు ఆంధ్రాకు పోవట్లేదు. ఆంధ్రా వాళ్లు పైసలు లేక బిచ్చమెత్తుకుంటున్నారు. ఏపీలో సీఎం జగన్ బిచ్చమెత్తుతున్నారు.. రోజు ఖర్చులకు కూడా కేంద్రంపై ఆధారపడుతున్నారు. ఇప్పుడు అప్పులు చేయకుంటే ఏపీలో పాలన నడవదు. కేంద్రం ఒత్తిడికి తలొగ్గే ఏపీలో బోర్లకు మీటర్లు పెడుతున్నారు అని ప్రశాంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
తెలంగాణ అప్పుల పాలైంది: పేర్ని నాని
కేంద్ర నిధుల కోసం బిచ్చమెత్తుకుంటున్నామని అంటున్నారు. తెలంగాణ మంత్రుల వ్యాఖ్యలు సరికాదు. తెలంగాణ ఎన్ని అప్పులు చేసిందో.. బ్యాంకులను అడిగితే తెలుస్తుంది. జగన్ ఎప్పుడూ ఒకటే విధానంతో ముందుకు వెళ్తారు. కేసీఆర్ లాగా బయటొక మాట, లోపలొక మాట మాట్లాడరు. అప్పుల కోసం తెలంగాణ నేతలు ఏం చేస్తున్నారు? సీఎం కేసీఆర్ తరచుగా కేంద్రం వద్దకు దేనికి వెళ్తున్నారు? నిధులివ్వండి కేంద్రంలో చేరుతామని కేసీఆర్ కోరుతున్నారు.
బయట కాలర్ ఎగరేసి.. లోపలికి వెళ్లి కాళ్లు పట్టుకోవడం జగన్‌కు రాదు. హైదరాబాద్ పెద్ద పాడికుండ. పాడికుండ లాంటి హైదరాబాద్ ఉన్నా తెలంగాణ అప్పుల పాలైంది. ఉమ్మడి రాష్ట్రంలో అందరూ హైదరాబాద్‌ను అభివృద్ధి చేశారు. అత్తమీద కోపం దుత్తమీద చూపినట్లు.. తెలంగాణ నేతల వైఖరి ఉంది అని పేర్ని నాని అన్నారు.