శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 5 జులై 2021 (16:51 IST)

బండ బూతులు తిట్టే ఏపీ మంత్రులు ఇపుడు గాజులు తొడుక్కున్నారా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విపక్షనేతలపై బూతులతో విరుచుకుపడే రాష్ట్ర మంత్రులు ఇపుడు గాజులు తొడుక్కుని కూర్చొన్నారా అంటూ టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌ రెడ్డి నిలదీశారు. మహానేత వైఎస్ఆర్‌ను తెలంగాణ మంత్రులు రాక్షసుడు అంటుంటే ఏపీ మంత్రులు పత్తాలేకుండా పోయారని వ్యాఖ్యానించారు. 
 
ప్ర్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం నెలకొనివుంది. దీనిపై తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు స్పందిస్తూ దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్‌ను ఏకంగా రాక్షసుడుతో పోల్చారు. 
 
ఈ వ్యాఖ్యలపై ఏపీ మంత్రుల్లో ఒకరిద్దరు మినహా మిగిలినవారు నోరుమెదలేదు. ఈ పరిస్థితుల్లో తాజాగా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి స్పందించారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ వైఎస్ తనకు ఇష్టమైన నాయకుడు, ఆప్తుడు అని  పేర్కొన్నారు. 
 
తెలంగాణకు ద్రోహం చేశారని... రాక్షసుడు అని తెలంగాణ మంత్రులు వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. రాజశేఖర్ రెడ్డి లాంటి పెద్ద మనుషిని రాక్షసుడు అంటారా? అని జేసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజశేఖర్ రెడ్డి లాంటి పెద్ద మనిషిని బండ బూతులు తిడుతుంటే ఇప్పుడు ఏం చేస్తున్నారని మండిపడ్డారు.
 
ఏపీలోని విపక్ష నేతలపై బండ బూతులు తిట్టే ఏపీ మినిస్టర్లు ఇప్పుడు గాజులు తొడుక్కున్నారా? అని ప్రశ్నించారు. హైదరాబాదులో సెటిలర్స్ ఎవరని నిలదీశారు. తమ పిల్లలు హైదరాబాద్‌లోనే పుట్టారని.. అక్కడే చదువుకున్నారని.. ఇక్కడ ప్రజలు హైదరాబాద్‌కి వెళ్లి షాపింగ్ చేస్తున్నారని జేసీ పేర్కొన్నారు.