శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 8 నవంబరు 2021 (14:35 IST)

సోను సూద్‌కు అండగా నిలుస్తాం : మంత్రి కేటీఆర్

కరోనా లాక్డౌన్ సమయంలో ఎన్నో వేల మంది నిరాశ్రయులను ఆదుకున్న రియల్ హీరో సోనుసూద్. సోమవారం హైదరాబాద్ నగరంలోని హెచ్‌ఐసీసీలో కోవిడ్ వారియర్లకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్, నటుడు సోనూసూద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. 
 
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోనూసూద్ రాజకీయాల్లోకి వస్తాడనే భయంతోనే అతడిపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. అందుకే సోను సూద్‌ ఇళ్లపై ఐటీ దాడులు, ఈడీ దాడులు చేయించారని విమర్శలు చేశారు. అంతేకాకుండా సోను సూద్ వ్యక్తిత్వాన్ని కూడా తగ్గించే ప్రయత్నం చేశారన్నారు. 
 
ఇలాంటి వారికి సోనూసూద్ భయపడాల్సిన అవసరం లేదని.. సోనూ వెనుక తాముంటామని కేటీఆర్ భరోసా ఇచ్చారు. కరోనా కష్టకాలంలో సోను సూద్ తన సేవాభావాన్ని చాటుకున్నారని, తన పని, తన సేవలతో ప్రపంచం దృష్టి ఆకర్షించారని కేటీఆర్ కొనియాడారు. 
 
కోవిడ్‌తో చాలా మంది ఉద్యోగాలు, చదువులతో పాటు ఆత్మీయులను కోల్పోయారని, అలాంటి వాళ్లకు సహాయపడటం చాలా గొప్ప విషయమన్నారు. విపత్తు సమయాల్లో అన్ని కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహించలేదని.. అలాంటప్పుడు స్వచ్ఛంద సంస్థల చేయూత ఎంతో అవసరమని మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు.