15న నెల్లూరు జిల్లాలో చేపల వేటపై నిషేధం.. ఎందుకు?
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చంద్రయాన్-2 ప్రయోగాన్ని చేపట్టనుంది. ఆ ప్రయోగ సమయంలో మత్స్యకారులు వేటకు వెళ్లరాదని నెల్లూరు జిల్లా కలెక్టర్ శేషగిరిబాబు ఆదేశాలు జారీచేశారు. జిల్లాలోని శ్రీహరికోట సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి ఈ నెల 15వ తేదీ తెల్లవారుజామున 2.51 గంటల సమయంలో జీఎస్‌ఎల్వీ మార్క్-3 ద్వారా చంద్రయాన్-2 రాకెట్ ప్రయోగం నిర్వహించనున్నారు.
ఈ నేపథ్యంలో ఆ రోజు వేకువజాము ఒంటిగంట నుంచి 4 గంటల మధ్యలో మత్స్యకారులు ఎవరూ నిర్ణీత అపాయకర ప్రాంతమైన పులికాట్ లైట్‌హౌస్ నుంచి ఆర్మగాన్ లైట్‌హౌస్ వరకు చేపలవేటకు వెళ్లరాదని జిల్లా కలెక్టర్ ఎంవీ శేషగిరిబాబు ఒక ప్రకటనలో ఆదేశించారు. ఈ విషయమై మత్స్యశాఖ సంయుక్త సంచాలకులు, తహసీల్దార్లు, వీఆర్‌వోలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరూ ప్రమాదానికి గురికాకుండా పర్యవేక్షించాలని కోరారు.