గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 6 మార్చి 2021 (10:53 IST)

ఉపాధి హామీ పనుల్లో కొత్త రికార్డు:మంత్రి పెద్దిరెడ్డి

రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ పనులను చేపట్టడం ద్వారా రికార్డు స్థాయిలో కోట్లాధి మందికి పని కల్పించామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, భూగర్భ గనుల శాఖా మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు.

మంత్రి మీడియాతో మాట్లాడుతూ....:ఈ ఏడాది కేంద్రప్రభుత్వం 25.25 కోట్ల పనిదినాలను ఉపాధి హామీ కింద రాష్ట్రానికి  కేటాయించింది. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఇప్పటి వరకు 23.67 కోట్ల పనిదినాలను పేదలకు కల్పించాం. ఈ నెలాఖరు నాటికి మిగిలిన పనిదినాలను కూడా పూర్తి చేస్తాం.

గతంలో ఎప్పుడూ కూడా ఇంత పెద్ద ఎత్తున చేయలేదు. రాష్ట్ర చరిత్రలోనే ఇది ఒక రికార్డు. దీనికోసం ఇప్పటి వరకు సుమారు వేతన పనిదినాలకు రూ.5423 కోట్లు ఖర్చు చేశాం. ఈ నెలాఖరు నాటికి మొత్తం రూ. ఆరువేల కోట్లు ఖర్చు చేస్తాం.

ఆస్థులను ఏర్పాటు చేసుకునేందుకు గ్రామసచివాలయాలు, అంగన్ వాడీ, వెల్‌నెస్ సెంటర్లు, ఆర్బీకెలు తదితర భవనాల కోసం అరవై శాతం మెటీరియల్ కాంపోనెంట్ కింద మొత్తం రూ. నాలుగు వేల కోట్ల వరకు ఖర్చు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. దీనిలో ఇప్పటి వరకు రూ.3,086 కోట్లు ఖర్చు చేశాం. 
 
పిఎంజిఎస్‌వై కింద గ్రామీణ రహదారులకు మహర్థశ
పిఎంజిఎస్‌వై కింద రాష్ట్రంలోని గ్రామీణ రహదారులకు మహర్థశ కల్పిస్తున్నాం. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో అయిదేళ్ళలో ఒక్క రోడ్డు కూడామంజూరు కాలేదు. ఈ ఏడాది రాష్ట్రంలో 3,185 కిలోమీటర్ల మేర పిఎంజిఎస్‌వై కింద రహదారులు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.

మొదటి విడత కింద రూ.524.36 కోట్లతో 935.84 కిలోమీటర్ల మేర  పనులు ప్రారంభించాం. రెండో విడతలో రూ.766.54 కోట్ల అంచనా వ్యయంతో 1378.54 కిలోమీటర్లు మంజూరయ్యాయి. ఇప్పటికే బ్యాలెన్స్‌ పనుల కింద గుర్తించిన 970.62 కిలోమీటర్లకు డిపిఆర్‌లు తయారవుతున్నాయి. ఈ నెల 10వ తేదీన ఈ డిపిఆర్‌లను కేంద్రానికి మంజూరీ కోసం పంపుతున్నాం. 
 
ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి అందిస్తాం
జల్ జీవన్ మిషన్ కింద ప్రతి ఇంటికి మంచినీటి కుళాయిని అందించబోతున్నాం. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ ఏడాది మొత్తం 19,21,050 ఇళ్ళకు కుళాయిలను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.

దీనిలో భాగంగా  ఈ ఏడాది జనవరి నాటికి 4,60,118 కుళాయిలను అందించగా, ఈ నెల ప్రారంభంలోనే 9,41,731 కుళాయిలను అందించాం. అంటే 49.02 శాతం లక్ష్యాన్ని సాధించాం. ఈ నెలాఖరు నాటికి మొత్తం ఆరు లక్షల కనెక్షన్లు ఇవ్వాలని గ్రామీణ నీటిసరఫరా విభాగం అధికారులను ఆదేశించాం. 
 
వైయస్‌ఆర్ జలకళ కింద రూ.4వేల కోట్లు
ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని పేద, చిన్నా, సన్నకారు రైతులను ఆదుకునేందుకు నిర్ధేశించిన వైయస్‌ఆర్‌ జలకళ పథకం కోసం మూడేళ్ళలో మొత్తం రూ.4వేల కోట్లు ఖర్చు చేయబోతున్నాం.

వ్యవసాయ బోర్ల కోసం రైతులు అప్పులు పాలు కాకూడదనే మంచి ఆశయంతో సీఎం తలపెట్టిన ఈ పథకం కింద ఉచితంగా బోర్లతో పాటు మోటార్లు, ఇతర విద్యుత్ పరికరాలను కూడా అందిస్తున్నాం.

ప్రస్తుతం డీజిల్ రేట్లలో పెరుగుదల నేపథ్యంలో డ్రిల్లింగ్ చేసే వారు కూడా నష్టపోకుండా రేట్ల ఎక్సలేషన్ కు అనుగుణంగా చెల్లింపులు జరుపుతున్నాం. బోర్ల మధ్య దూరంను గతంలో రెండు వందల మీటర్ల మేరకు పరిమితం చేస్తే, దానిని కూడా రైతుల విజ్ఞప్తి మేరకు దూరం తగ్గించడం జరిగింది. 
 
ప్రజలకు సంతృప్తస్థాయిలో పథకాల అమలు
ప్రభుత్వం అమలు చేసే పథకాలు సంతృప్త స్థాయిలో వుండాలన్నదే ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యం. ఆ మేరకే అధికార యంత్రాంగం పనిచేస్తోంది. ప్రభుత్వం అమలు చేసే ప్రతి పథకం అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరువ కావాలి.

అందుకోసం సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ పనిచేస్తోంది. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు జన్మభూమి కమిటీలను ఏర్పాటు చేసి, కేవలం తమకు అనుకూలంగా వున్నవారికే ప్రభుత్వ పథకాలను అందించింది.

కానీ సీఎం వైయస్ జగన్ మాత్రం కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా అర్హతే కొలమానంగా ప్రభుత్వ పథకాలను అమలు చేస్తున్నారు. ఇదే విధానంను కొనసాగించాలని మేం కూడా అధికారులకు నిర్ధేశిస్తున్నాం. అందువల్లే మా పాలనకు తీర్పుగా పంచాయతీ ఎన్నికల్లో ఎనబైశాతంకు పైగా ప్రజలు మద్దతు పలికారు.

రానున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో తొంబైశాతం మేరకు విజయం సాధిస్తాం. ఇదంతా సీఎం వైయస్ జగన్  కృషి. దానిని ఈ స్థానిక సంస్థల ఎన్నికలు ప్రతిబింభిస్తున్నాయి" అని తెలిపారు.