తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు శనివారం పంచాయితీ ఎన్నికలపై ఆయా ప్రాంతాల టిడిపి నాయకులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. గ్రామాల్లో నూతన అధ్యాయానికి ఈ ఎన్నికలే నాంది..టిడిపి అభివృద్దికి, వైసిపి అరాచకానికి మధ్య ఎన్నికలు ఇవి..నీతికి, అవినీతికి మధ్య ఎన్నికలు ఇవి. వైసిపి ఉన్మాద చర్యలకు అడ్డుకట్ట వేసే అవకాశం ఇది.
ఈ ఎన్నికలతో నూతన రాజకీయ ఒరవడికి శ్రీకారం చుట్టాలి. ప్రతి ఊళ్లో పంచాయితీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి. వైసిపి బెదిరింపులు, ఇబ్బందులను ఎదుర్కొని వీరోచితంగా పోరాడుతున్న అందరికీ అభినందనలు.
మూడో విడత ఎన్నికల్లో అన్నిగ్రామాల్లో 100% నామినేషన్లు వేయాలి. స్క్రూటినిలో, ఉపసంహరణల్లో అప్రమత్తంగా ఉండాలి. అవసరం లేకపోయినా, పోలీసు క్లియరెన్స్ సర్టిఫికెట్ ఉండాలని, నామినేషన్ల ప్రపోజర్స్( సమర్ధించేవాళ్లు) కూడా నో డ్యూస్ సర్టిఫికెట్లు ఇవ్వాలనే వంకలతో తిరస్కరించాలని చూస్తున్నారు. పంచాయితీరాజ్ చట్టంలో లేని అంశాలు సాకుగా చూపి నామినేషన్ల తిరస్కరణ చెల్లదు.
వైసిపి తప్పుడు పనులపై నిఘాపెట్టాలి, వాళ్ల బెదిరింపులన్నీ రికార్డు చేసి పంపాలి. వైసిపి డబ్బు, మద్యం పంపిణీపై ఫొటో వీడియో సాక్ష్యాధారాలను ఎన్నికల సంఘానికి, జిల్లా అధికారులకు, టిడిపి కంట్రోల్ రూమ్ కు పంపాలి.
సోషల్ మీడియాను సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పటికే మొదటి, రెండవ విడత ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. టిడిపి హయాంలో జరిగిన అభివృద్ది పనులపై ప్రజల్లో ప్రచారం చేయాలి. గ్రామాల్లో ఈ 20నెలల్లో వైసిపి ఏ ఒక్క అభివృద్ది పని చేయలేదు. టిడిపి గతంలో చేసిన పనులన్నీ నిలిపేశారు.
ప్రతి ఊళ్లో రాబోయే 5ఏళ్లలో రూ5కోట్లపైగా అభివృద్ది పనులు.. ఆర్ధిక సంఘం నిధులు, నరేగా నిధులతో గ్రామీణాభివృద్ది పనులు..వైసిపి గెలిస్తే ఈ రూ5కోట్లు వాళ్లే స్వాహా చేస్తారు.
సర్పంచులుగా గెలిస్తే ఊరు బాగు చేసుకోవచ్చు. నరేగా బిల్లులు తెచ్చుకోవచ్చు. మీ ఊళ్లో పేదలకు సంక్షేమ పథకాలు అందించవచ్చు. గ్రామాల్లో వైసిపి అరాచకాలను అడ్డుకోవచ్చు.
ఇసుక మొత్తం వైసిపి దోపిడీ..శాండ్ మాఫియా అరాచకాలకు అంతేలేదు. సొంత సిమెంట్ ఫ్యాక్టరీ లాభాల కోసం సిండికేట్ లతో సిమెంట్ ధరలు పెంచేశాడు. లక్షలాది భవన నిర్మాణ కార్మికుల జీవనోపాధిని దెబ్బతీశారు.
సొంత మీడియా లాభాల కోసం, ప్రతిరోజూ యాడ్స్ పేరుతో ప్రజాధనం దోపిడీ చేస్తున్నాడు. మద్యం సొంత బ్రాండ్లతో నాసిరకం అంటగట్టి ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నారు. ప్రతి ఊళ్లో వైసిపి ల్యాండ్ మాఫియా రెచ్చిపోతోంది. పేదల అసైన్డ్ భూములను కూడా వదిలిపెట్టడం లేదు. ఇళ్ల స్థలాల్లో వేలకోట్ల అవినీతికి పాల్పడ్డారు.
అన్ని జిల్లాలలో ఖనిజ సంపద మొత్తం దోచేస్తున్నారు. ముగ్గురాయి, సున్నపు రాయి, బాక్సైట్, లేటరైట్, గ్రానైట్, సిలికాన్ శాండ్..ఏది దొరికితే అది దోచేస్తున్నారు.
మొన్న కృష్ణపట్నం పోర్ట్-మచిలీపట్నం పోర్ట్, నిన్న కాకినాడ పోర్ట్- కాకినాడ సెజ్ ..ఇప్పుడు విశాఖ ఉక్కుపై పడ్డారు. పోరాడి సాధించుకున్న ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు. అదికూడా బినామీల పరంచేసే కుట్రలకు పాల్పడుతున్నారు.
మోటార్లకు మీటర్లు పెట్టడంపై రైతుల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది.
పోరాడి సాధించుకున్న హక్కు ఉచిత విద్యుత్. ఎన్టీఆర్ ఇచ్చిన వరం. 0.25% అప్పుల కోసం మోటార్లకు మీటర్లు పెట్టి 20లక్షల రైతుకుటుంబాల ఉసురు పోసుకుంటున్నారు. ఎంఎస్ పి లేదు, ఇన్సూరెన్స్ లేదు,ఇన్ పుట్ సబ్సిడి లేకుండా చేశారు. వైసిపి రైతాంగ వ్యతిరేక విధానాలకు ఈ ఎన్నికల్లో బుద్ది చెప్పాలి.
ఏ పారిశ్రామిక వేత్త ఏపికి రావడం లేదు. పెట్టుబడిదారులను రాష్ట్రంనుంచి తరిమేశారు. విభజన చట్టంలో హామీలన్నీ అటకెక్కాయి. ఆ రోజు పాదయాత్రలో జగన్ చెప్పిన మాటలు ఏమయ్యాయి..? కేంద్రం మెడలు వంచుతానన్న ప్రగల్భాలు ఏమయ్యాయి..?
కేసుల మాఫీ కోసం కేంద్రం ముందు మోకరిల్లుతావా..? ఇంట్లో నోర్మూసుకుని పడుకోడానికా మీ మందబలం..? ఇందుకేనా 25మంది ఎంపిలను గెలిపించాలని కోరింది..? మీ మందబలాన్ని మీ స్వార్ధానికే వినియోగించడం సిగ్గుచేటు..
అధికార మదంతో అన్నివర్గాలపై దాడులు చేస్తున్నారు....అటు దేవాలయాలపై దాడులు, ఇటు బిసి ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనారిటీలపై దాడులు..
మనం అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నామా..? ఇంత బరితెగింపు, ఉన్మాద పాలన చరిత్రలో లేదు. ఇలాంటి ఉన్మాదులు అధికారంలోకి వస్తారని అంబేద్కర్ ముందే ఊహించారు. అందుకే ఎన్నికల సంఘం, న్యాయవ్యవస్థ, శాసన నిర్మాణవ్యవస్థ, శాసన అమలు వ్యవస్థ, మీడియా.. తో కట్టుదిట్టమైన రాజ్యాంగ వ్యవస్థలను రూపొందించారు.
ఉన్మాదంలో ముఖ్యమంత్రితో మంత్రులు పోటీబడుతున్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బెదిరింపులే ఉదాహరణ. ఎన్నికల సంఘాన్ని, అధికారులను బెదిరించడం సిగ్గుచేటు. ఈసి ఉండేది కొన్నిరోజులే, ఈసి ఆదేశాలు పాటించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పడం రాజ్యాంగ ఉల్లంఘనే..మంత్రిగా ఉండటానికే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనర్హుడు.
కోర్టులను లెక్కచెయ్యరు, ఈసిని లెక్కచెయ్యరు, ప్రతిపక్షాలను లెక్కచెయ్యరు.. నిష్పాక్షికంగా చట్టం అమలు చేయడానికే ఆలిండియా సర్వీస్(ఏఐఎస్) అధికారులు ఉన్నది.. మీ స్వార్ధానికి వాళ్లను బలిచేయడానికి కాదు.
పేదలపై వేలకోట్ల పన్నుల భారాలు మోపారు. పెట్రోల్ డీజిల్, నిత్యావసరాల ధరలు అన్నీ పెరిగిపోయాయి. రూ లక్షన్నర కోట్ల అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని ముంచేశారు.
వైసిపి దుర్మార్గాలపై ఇంటింటి ప్రచారం ద్వారా అన్నివర్గాల ప్రజల్లో చైతన్యం పెంచాలి. వైసిపి రౌడీలు, గుండాల బారినుంచి గ్రామాలను, రాష్ట్రాన్ని కాపాడాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.