మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 2 ఫిబ్రవరి 2021 (10:19 IST)

జగన్ రెడ్డి తగిన మూల్యం చెల్లించక తప్పదు: చంద్రబాబు

ఏపి టిడిపి అధ్యక్షుడు అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేయడంపై తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.

"అచ్చెన్నాయుడు అరెస్ట్ జగన్ రెడ్డి కక్ష సాధింపునకు పరాకాష్ట. 
ఉత్తరాంధ్రపై జగన్ రెడ్డి కక్ష కట్టారు. అందుకే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలలో భయోత్పాతం సృష్టిస్తున్నారు. నిమ్మాడలో గత 40ఏళ్లలో ఏనాడూ ఇలాంటి ఉద్రిక్తతలు లేవు. ప్రశాంతగ్రామంలో ఉద్రిక్తతలు సృష్టించింది ఎవరు..?

దువ్వాడ శ్రీనివాస్ స్వగ్రామానికి అచ్చెన్నాయుడు వెళ్లాడా..? అచ్చెన్న స్వగ్రామానికి దువ్వాడ వచ్చి ఘర్షణలు రెచ్చగొట్టారా..?వాటికి సంబంధించి ఫోటోలు, వీడియోలే సాక్ష్యాధారాలు.

దువ్వాడ శ్రీనివాస్ పై కేసు పెట్టకుండా అచ్చెన్నాయుడుపై తప్పుడు కేసు పెట్టడం గర్హనీయం. ఐపిసి లో ఎన్ని సెక్షన్లు ఉన్నాయో అన్ని సెక్షన్లు పెడతారా..? అయినా అచ్చెన్నాయుడిపై మీ కసి తీరలేదా..?  

ప్రశాంతతకు మారుపేరైన ఉత్తరాంధ్రపై పగబట్టి హింసా విధ్వంసాలు చేస్తున్నారు. రామతీర్ధం సంఘటనలో కళా వెంకట్రావుపై, నాపై, అచ్చెన్నాయుడిపై కూడా తప్పుడు కేసులు పెట్టారు.

కూన రవికుమార్ , వెలగపూడి రామకృష్ణబాబు సహా అనేకమంది నాయకులపై అక్రమ కేసులు పెట్టారు. సబ్బం హరి ఇంటిని, గీతం విశ్వవిద్యాలయం భవనాలను ధ్వంసం చేశారు.
 
గతంలో అచ్చెన్నాయుడిపై తప్పుడు కేసు పెట్టి 83రోజులు అక్రమ నిర్బంధం చేశారు. ఆపరేషన్ చేయించుకున్న వ్యక్తిని అమానుషంగా 5జిల్లాల్లో 20గంటలు 700కిమీ తిప్పించి మళ్లీ ఆపరేషన్లకు కారణం అయ్యారు.

అచ్చెన్నాయుడు చేసిన నేరం ఏమిటి..? మీ అవినీతి కుంభకోణాలు బైటపెట్టడమే అచ్చెన్నాయుడు చేసిన నేరమా...? మీ హింసాకాండపై ధ్వజమెత్తడమే అచ్చెన్నాయుడు చేసిన తప్పిదమా..? 

దీనికి తగిన మూల్యం జగన్ రెడ్డి చెల్లించక తప్పదు. వైసిపి పుట్టగతులు కూడా లేకుండా పోతుంది. పంచాయితీ ఎన్నికల్లో ప్రజలు వైసిపికి తగిన బుద్ది చెబుతారు.

తక్షణమే అచ్చెన్నాయుడిని బేషరతుగా విడుదల చేయాలి. ఆయనపై పెట్టిన తప్పుడు కేసులు  వెంటనే ఎత్తేయాలని’’ చంద్రబాబు డిమాండ్ చేశారు.