శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 25 ఆగస్టు 2020 (08:39 IST)

త్వరలో మచిలీపట్నంకు నూతన ట్రాఫిక్ సొబగులు.. ఎందుకో తెలుసా?

చారిత్రాత్మక నేపధ్యం గల మచిలీపట్నంలో త్వరలో పోర్టు, వైద్య కళాశాల ఒనగూరనున్న నేపథ్యంలో ముందస్తుగా రహదారి భద్రత, ట్రాఫిక్ అవరోధాలను సమర్థవంతంగా ఎదుర్కోనేందుకు పోలీస్ శాఖ, రవాణాశాఖ సంయుక్త ఆధ్వర్యంలో ప్రణాళికలు సిద్దం చేసి పట్టణంలో నూతన ట్రాఫిక్ సొబగులు ఏర్పరచనున్నట్లు రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని ప్రకటించారు. 

కృష్ణాజిల్లా పోలీసు కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్‌హాలులో రాష్ట్ర రవాణా శాఖ ట్రాన్స్పోర్ట్ కమీషనర్ పి. సీతారామాంజినేయులు ముఖ్య అతిధిగా రోడ్ సేఫ్టీ ఆడిట్ గూర్చి ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. జిల్లా ముఖ్య కేంద్రమైన మచిలీపట్నంలో అనేక పనులపై వచ్చి వెళ్లే వారికి సంఖ్య గణనీయంగా పెరుగుతుండటంతో ట్రాఫిక్ ‌ పెరిగిపోయిందన్నారు. బందరు పోర్టు సిటీ గా అభివృద్ధి కానున్న నేపథ్యంలో ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తకుండా పలు అభివృద్ధి చర్యలు తీసుకోవాలన్నారు.

మచిలీపట్నంలో 5  ప్రాంతాలలో ట్రాఫిక్ సిగ్నల్ లైట్ల పునరుద్ధరణ, మరో 3 కొత్త ట్రాఫిక్ సిగ్నల్ లైట్లను ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా 216 జాతీయ రహదారి పనుల విస్తరణలో భాగంగా కోటావారితుళ్ళ సెంటర్లో ఒక పెద్ద జంక్షన్ ఏర్పాటుకానున్నట్లు చెప్పారు. 

పవర్ పాయింట్ ప్రజెంటేషన్  ద్వారా మచిలీపట్నంలో గుర్తించబడిన 30 కూడళ్లలో రోడ్లు భవనాల శాఖ పోలీస్, రవాణాశాఖ పరిశీలించిన నివేదికను వివరించారు.

మచిలీపట్నం సమీప ప్రాంతాలలో ఉన్న నాలుగురోడ్ల కూడళ్ళు, ప్రధాన సెంటర్లలో ఎదురయ్యే ట్రాఫిక్ సమస్యలు, ట్రాఫిక్ను క్రమబద్దీకరించి, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణం సాఫీగా సాగేందుకు, ఆధునిక సాంకేతిక విధానాలను అవలంబించే ఏవిధంగా సిగ్నల్ వ్యవస్థ, జిబ్రా లైన్లు క్రమబద్ధీకరణ తదితర విషయాలు అధికారులు ఈ కార్యక్రమంలో చర్చించారు.

మూడు స్థంబాల సెంటర్ లో విజయవాడ - మచిలీపట్నం జాతీయ రహదారి 70 కిలోమీటర్లు రోడ్డు ఇక్కడ ఆకస్మికంగా ముగిసిపోతున్నట్లు భావన  వాహనదారులకు కలగదని అలాగే ఇక్కడ మార్కింగ్ గాని డ్రైవర్లకు సూచనలు లేవని  అందుకు బదులుగా పోలార్ లాంప్ ఏర్పాటుచేసి రోడ్డు ఎండింగ్ తెలియచేస్తూ ముఖద్వారం ఏర్పాటు చేయాలన్నారు.

అలాగే  చల్లారాస్త కూడలి లో  స్పీడ్ బ్రోకర్లు,  కోనేరు సెంటర్ లో టాఫిక్ లైట్స్, పార్కింగ్ స్థల ఆధునీకరణ, రాజాగారి సెంటర్ లో ట్రాఫిక్ ఐలాండ్, రేవతి సెంటర్ లో ట్రాఫిక్ సిగ్నెల్ లైట్ల పునరుద్ధరణ, బస్టాండ్ కూడలి, జిల్లాపరిషత్, రామనాయుడుపేట తదితర ప్రాంతాలలో ఏర్పాటుచేయబోయే నవీకరణ పనులను వివరించారు. 

ఈ సమావేశంలో అడిషనల్ డీజీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ పి. సీతారామాంజనేయులు, జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు, అడిషనల్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఎస్.ఎ.వి ప్రసాద్ రావు, ఆర్డీవో ఖాజావలి, మచిలీపట్నం మునిసిపల్ కమీషనర్ శివరామకృష్ణ, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ పురేంద్ర, ఏఎస్పీ వకుల్ జిందల్, ఏ.ఆర్ అడిషనల్ ఎస్పీ సత్యనారాయణ,

స్పెషల్ బ్రాంచ్ డిఎస్పి ధర్మేంద్ర, బందరు డి.ఎస్.పి మహబూబ్ బాషా, 216 జాతీయ రహదారి ఇంజీనీర్  నిరంజన్, 65వ జాతీయ రహదారి సాంకేతిక అధికారులు విజయకుమార్, సంతోష్ కుమార్, రవాణా, పోలీసు శాఖ అధికారులుసంబంధించిన పలువురు అధికారులు  పాల్గొన్నారు.