శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కె
Last Modified: విజయవాడ , సోమవారం, 20 సెప్టెంబరు 2021 (16:13 IST)

'బెజవాడ'కు సంబంధం లేదు! అడ్రస్ మాత్రమే వాడారు!!

సంచలనం రేపిన అఫ్గానిస్తాన్ టూ గుజరాత్.. వయా విజయవాడ హెరాయిన్ కథనాలపై నగర పోలీస్ కమిషనర్ బత్తిన శ్రీనివాసులు స్పందించారు. గుజరాత్ లోని ముండ్రా పోర్టులో పట్టుబడిన హెరాయిన్ కన్సైన్మెంట్ తో విజయవాడ నగరానికి సంబంధం వున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆయన పేర్కొన్నారు. ఆఫ్గానిస్తాన్ నుంచి దిగుమతి చేసుకున్న మాదకద్రవ్యాలను నగరానికి తీసుకొచ్చి, ఇక్కడి నుంచి దక్షిణాది రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నట్లు వ‌స్తున్న స‌మాచారంపై దర్యాప్తు చేపట్టామని సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో సీపీ తెలిపారు. 
 
చైన్నైలో స్థిరపడిన మాచవరం సుధాకర్ అనే వ్యక్తి తన భార్య గోవిందరాజు దుర్గా పూర్ణ వైశాలి పేరుతో అంతర్జాతీయ ఎగుమతి, దిగుమతులకు సంబంధించి డీజీఎఫ్టీ నుంచి లైసెన్స్ పొందారు. అయితే, వైశాలి తల్లి గోవిందరాజు తారకకు చెందిన విజయవాడలోని ఇంటి చిరునామా (ఇంటి నెం: 23-14-16, గడియారం వారి వీధి, సత్యనారాయణపురం)తో సదరు లైసెన్స్ తీసుకున్నారు. హెరాయిన్ కన్సైన్మెంట్ సంస్థ అడ్రసు విజయవాడ నగరానికి చెందినది కావడం తప్ప, మిగిలిన విషయాలన్నీ వాస్తవం కాదని, సుధాకర్-వైశాలి దంపతులు చాలా ఏళ్ల క్రితమే చైన్నైలో స్థిరపడ్డారని సీపీ తెలిపారు. టాల్కమ్ పౌడర్ పేరుతో దిగుమతి అయిన హెరాయిన్ విజయవాడ నగరానికి తరలింపబడేదంటూ వెలువడిన వార్తలు నిజం కాదని ఆయన పేర్కొన్నారు. 
 
పట్టుబడ్డ హెరాయిన్ కన్సైన్మెంట్ ఢిల్లీకి బుక్ చేయబడిందని వివరించారు. ఫారిన్ ట్రేడ్ లైసెన్స్ కోసం వినియోగించుకున్న ఇంటి చిరునామా తప్ప, అఫ్గానిస్తాన్ నుంచి దిగుమతి అయిన మాదకద్రవ్యాలతో విజయవాడ నగరానికి ఏ విధమైన సంబంధం లేదని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు సీపీ బత్తిన ప్రకటించారు. అయినప్పటికీ సంచలనం రేకెత్తించిన ఈ అంశంపై తదుపరి విచారణ కొనసాగుతుందని ఆయన వెల్లడించారు.